
ఎయిర్‌బేస్‌లో కొనసాగుతున్న కాల్పులు
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ప్రాంతంలో ఉన్న ఎయిర్‌బేస్ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున ఉగ్రదాడి ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పౌరుడు, ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా రెండు బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దాంతో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఇంకా లోపల నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అసలు ఆపరేషన్ ఎలా కొనసాగుతోందన్న విషయాన్ని భద్రతా దళాలు గోప్యంగా ఉంచుతున్నాయి. తొలిరోజు నలుగురిని, రెండో రోజు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
గత మూడు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. తొలిరోజు నలుగురిని, రెండోరోజు ఎయిర్ బేస్ లోపలి నుంచి ఇద్దరు కాల్పులు జరిపారు. దాంతో ఇద్దరు నిన్న చనిపోయారు. ఇంకో ఇద్దరు ఎయిర్ బేస్ లోపల ఉన్నారని తెలుస్తోంది. దీంతో అసలు ఇక్కడకు వచ్చిన మొత్తం ఉగ్రవాదులు ఎంతమంది అన్న విషయం స్పష్టం కావడం లేదు. శుక్రవారం నాడు ఎస్పీ వాహనంపై దాడిచేసింది ఐదుగురే అయినా.. ఇతర మార్గాల్లో కూడా ఉగ్రవాదులు వచ్చి ఉంటారని, వీళ్లంతా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ సమీపంలో కలిసి ఉంటారని భావిస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఆర్మీ హెలికాప్టర్లతో పాటు బుల్డోజర్లను కూడా ఉపయోగిస్తున్నారు. పెద్ద ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది.