
‘‘దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వీరులను గౌరవించడం ఇలాగేనా? సరిహద్దుల్లో వారి ప్రాణాలను అడ్డుపెట్టి ఈ దేశంలో ఉంటున్న వారందరినీ కాపాడుతున్నారు. అటువంటి వీరులకు కష్టం వస్తే స్పందించే తీరు ఇదేనా? వారి కుటుంబాలు ఎంత దుర్భర స్థితిలో జీవితాన్ని సాగిస్తున్నా పరిహా రం కోసం అడుక్కోరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. విధి నిర్వహణలో వీరోచిత మరణం పాలైతే వారికి శ్రద్ధాంజలి ఘటించే పేరుతో నేతలు పతాక శీర్షికలకు ఎక్కుతారు. అంత పరిహారం ఇస్తాం.. ఇంత ఇ స్తాం.. అంటూ వాగ్దానాలు చేస్తారు. మళ్లీ వారి గురిం చి పట్టించుకోరు. ఆ వీరుల చేతుల్లో ఉండేది జాతీయ జెండాలే తప్ప.. రాజకీయ పార్టీల జెండాలు కాదు. బహుశా అందుకే వారంటే ప్రభుత్వాలకు పట్టదేమో.
– కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి కుడి కన్ను, కుడి చేయి, కుడి కాలు పనిచేయని స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) సైనికుడు కంగాల శ్రీరాములుకు తగిన సాయం అందజేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. శ్రీరాములుకు జంటనగరాల చుట్టుపక్కల అది కూడా జనావాసాలకు సమీపంలోనే కనీసం 10 సెంట్ల భూమి, రూ.1.5 కోట్లకు తగ్గకుండా ఆర్థిక సాయం అందించాలని ఇరు ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. లేకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ శ్రీరాములు నేపథ్యం
కంగాల శ్రీరాములు ఎన్‌ఎస్‌జీ కమాండో. బాంబుల నిర్వీర్య నిపుణుడు. 2016లో పఠాన్‌కోట్‡ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన కుడి కన్ను, కుడి చేయి, కుడి కాలు పనిచేయకుండా పోయాయి. ఈ ఘటన తర్వాత అతడి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు దక్కలేదు. దీనిపై పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ లేఖ రూపంలో శ్రీరాములు పరిస్థితిని అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్‌గా పరిగణించి విచారణ ప్రారంభించారు. గతేడాది ఈ కేసులో కేంద్రం, తెలంగాణలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఉభయ ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగింది.
ఓ న్యాయమూర్తి లేఖ రాస్తే, దానిపై తాము నోటీసులు జారీ చేసి వివరణ కోరితే తప్ప శ్రీరాములు వంటి యుద్ద వీరులను గౌరవించారా అంటూ నిలదీసింది. గౌరవించకపోయినా ఫర్వాలేదని, అవమానించడం మాత్రం సహించరాని విషయమని మండిపడింది. ఏడాది కింద నోటీసులు ఇస్తే శ్రీరాములకు సాయం విషయం ఇంకా పరిశీలన దశలో ఉందని చెప్పడం ఎంత మాత్రం క్షమార్హం కాదంది. రాష్ట్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అతడి పిల్లల చదువు, వసతి బాధ్యతలను తీసుకుని ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలా చేయకపోవడం చాలా దురదృష్టకరమంది. యుద్ద వీరులను గౌరవించడం ఈ దేశానికి తెలియదని, రష్యా వంటి దేశాల్లో ఎంత గౌరవం ఇస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంది. ప్రతీ విషయానికి చేస్తున్నా.. సమయం కావాలని కోరడం సరికాదని, తల దగ్గర తుపాకీ పెడితే ఎంత వేగంగా పనులు అవుతాయో అంతే వేగంగా పనులు జరగాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment