న్యూఢిల్లీ: పన్ను వ్యవస్థలో మార్పులు చేసేందుకు గత ప్రభుత్వాలు జంకాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పన్ను వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకువచ్చామని, పన్ను చెల్లింపుదారుడు కేంద్రంగా ఆ వ్యవస్థను మార్చామని వివరించారు. ఆంగ్ల వార్తాచానెల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహించిన ఒక సదస్సులో బుధవారం ప్రధాని ప్రసంగించారు. దేశాభివృద్ధికి పన్ను ఆదాయం అవసరమని, అందువల్ల పన్ను పరిధిలో ఉన్నవారంతా తమ పన్నులను చెల్లించాలని కోరారు. పన్ను చెల్లింపును ఒక బాధ్యతగా, గౌరవంగా భావించాలని విజ్ఞప్తి చేశారు.
పన్ను ఎగ్గొట్టేందుకు కొందరు చేసే ప్రయత్నాల వల్ల నిజాయితీగా పన్ను చెల్లించేవారు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘పన్ను చెల్లింపుదారుల హక్కులను స్పష్టంగా పేర్కొన్న అత్యంత పారదర్శక పన్ను చట్టం అమల్లో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లో పన్ను చెల్లింపుదారులను వేధింపులకు గురి చేసే కాలం త్వరలోనే అంతరించిపోతుందని మీకు హామీ ఇస్తున్నా’ అన్నారు. పన్నులు చెల్లించకుండా ఉండేందుకు దారులు వెతికే కొందరివల్ల నిజాయితీగా తమ పన్నులను చెల్లిస్తున్నవారిపై అదనపు భారం పడుతోందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కోటి రూపాయల వార్షికాదాయం చూపిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా కేవలం 2200 మాత్రమే అన్నది నమ్మశక్యం కాని నిజం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment