ధర్నాలు, దహనాలు
రైల్వే చార్జీల పెంపుపై దేశవ్యాప్త నిరసనలు
ఉపసంహరించాలని విపక్షాల డిమాండ్
ఢిల్లీ, యూపీ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైలు చార్జీలను భారీగా పెంచడంపై శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో విపక్షాలు ధర్నాలు, రైల్‌రోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టాయి. సామాన్యులపై పెను భారం మోపేలా ఉన్న ఈ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ అరవిందర్‌సింగ్ లవ్లీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రైల్ భవన్ వెలుపల ధర్నా నిర్వహించారు. సీపీఎం నేతలు కూడా వీరికి జత కలిశారు. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్తంభించింది. నిరసనకారులు బ్యారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వాటర్ కేనన్లతో వారిన చెదరగొట్టారు. తమను గెలిపిస్తే దేశానికి మంచి రోజులు తీసుకొస్తామంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పిన వారు (ప్రధాని మోడీని ఉద్దేశించి) ఇప్పుడు కఠిన నిర్ణయాలు, చేదు గుళికలు అంటూ మాట్లాడుతున్నారని లవ్లీ దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అధికార సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎదుట ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద ప్రధాని మోడీ దిష్టబొమ్మను తగలబెట్టడంతోపాటు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఎస్పీ కార్యకర్తలతో ఘర్షణకు దిగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు.
వారణాసి, అలహాబాద్, మథుర, అలీగఢ్, కాన్పూర్ తదితర రైల్వే స్టేషన్ల వద్ద నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గత యూపీఏ ప్రభుత్వం రైలు చార్జీలను పెంచగా అది ప్రజావ్యతిరేక విధానమంటూ నాటి ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాసిన గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ ఇప్పుడు అదే ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారని బెంగాల్ ప్రతిపక్ష నేత సూర్యకాంతా మిశ్రా విమర్శించారు. కేరళలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో రైల్‌రోకోలు చేపట్టి నిరసన తెలిపారు. మరోవైపు రైలు చార్జీలను తగ్గించాలంటూ డీఎంకే చీఫ్ కరుణానిధి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి గత యూపీఏ సర్కారుకు ఏమాత్రం భిన్నంగా లేదని విమర్శించారు.