
బలహీనపడుతున్న పై-లీన్ తుపాను
భువనేశ్వర్/విశాఖపట్నం: పై-లీన్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఉత్తరాంధ్ర, ఒడిశాలలో 90 లక్షల మందిపై ఇది ప్రభావం చూపింది. లక్షల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. వరి, కొబ్బరి, జీడి మామిడి తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ఒక్క ఒడిశాలోనే 2,400 కోట్ల రూపాయల విలువైన పంట నష్టం జరిగింది. ఒడిశాలోని 14,514 గ్రామాలపై తుపాను ప్రభావం పడింది. 2.34 లక్షల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత్, టెలికమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం కలిగింది. గంజాం జిల్లా తీవ్రంగా దెబ్బతింది. గోపాల్‌పూర్ ప్రాంతంలో రెస్టారెంట్లు హొటళ్లు ధ్వంసం అయ్యాయి. తుపాను బాధితులు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. గోపాల్‌పూర్ లైట్‌హౌస్ తుపానువేగాన్ని తట్టుకుని నిలబడింది. శ్రీకాకుళం జిల్లాలో 39 గ్రామాల్లోకి నీళ్లు వచ్చి చేరాయి.
ఒడిశాలోని ఎన్‌హెచ్-5పై వాహనాలు ఇంకా నిలిచే ఉన్నాయి. గోపాల్‌పూర్ సమీపంలో రోడ్డుమార్గం మూసుకుపోయింది. తుపాను భయంతో రోడ్డు వెంబడి హోటళ్లు, దాబాలు మూసివేశారు. విశాఖ - కోల్‌కత రోడ్డు మార్గంలో అనేకచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. హౌరా- పూరి మధ్య రైలు సర్వీసులు ప్రారంభించారు.
ప్రస్తుతం ఒడిశాలోని జర్సగూడా వద్ద గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కోల్‌కత సమీపంలో సరుకు రవాణానౌక మునిగిపోయింది. కోల్‌కత సముద్రతీరానికి 25 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది. పనామాకు చెందిన ఎం.వి.బింగోగా దీనిని గుర్తించారు.