
47 మంది పోలీసులకు జీవితఖైదు
ఫిలిబిత్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో కోర్టు తీర్పు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 47 మంది పోలీసులకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. జూలై 12, 1991న సిక్కు యాత్రికుల బస్సును అడ్డుకున్న పోలీసులు వారిలో 10 మందిని నకిలీ ఎన్‌కౌంటర్ చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపామంటూ తర్వాతి రోజు పోలీసులు ప్రకటించారు. బస్సులోని కొందరిపై నేరచరిత్ర ఉందని, వాళ్ల చేతుల్లో ఆయుధాలు కూడా ఉన్నాయన్నారు. ఎన్‌కౌంటర్‌పై తీవ్ర దుమారం రేగడంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. టైస్టుల్ని చంపితే వచ్చే అవార్డులు, గుర్తింపు కోసమే హత్యాకాండకు పోలీసులు పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది.
సీబీఐ కథనం ప్రకారం, సిక్కు యాత్రికుల బస్సును కచ్లాపుల్ ఘాట్ వద్ద ఆపిన పోలీసులు 10 మంది పురుషులను బయటకు లాక్కొచ్చి వేరే వాహనంలోకి ఎక్కించారు. రాత్రి దాటాక అదనపు బలగాలు వచ్చిచేరాయి. 10 మందిని మూడు గ్రూపులుగా విభజించి అర్థరాత్రి సమయంలో దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో వారిని కాల్చి చంపారు. పది మృతదేహాలకు అదే రోజు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు అంత్యక్రియలు చేశారని సీబీఐ తన రిపోర్టులో తెలిపింది. మొత్తం 57మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 10 మంది విచారణ మధ్యలోనే మరణించారు. 47 మందిపై విచారణ జరిపి తీర్పు వెలువరించారు.