ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా కర్నల్ సింగ్ నియామకం చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా కర్నల్ సింగ్ నియామకం, తర్వాత పదవీకాలాన్ని పొడిగించడం చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ముంబైకి చెందిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి ఉదయ్‌బాబు ఖల్వాదేకర్ దాఖలు చేసిన ఈ పిల్‌పై వచ్చే వారం విచారణ జరగనుంది. 2015 నవంబర్ నుంచి 2016 నవంబర్ వరకు సింగ్ పదవీకాలాన్ని పొడిగించారని, ఇది కేంద్ర విజిలెన్స్ చట్టంలోని సెక్షన్25(డి) ప్రకారం పూర్తి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా నియమితులైన వ్యక్తి ఆ పదవిలో కనీసం రెండేళ్లపాటు కొనసాగాలని తెలిపారు.
ఈడీ డైరెక్టర్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరించడానికి, నిర్భయంగా చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వ ఒత్తిడులు పనిచేయకుండా ఉండడానికే రెండేళ్లు కచ్చితమైన నియామకం ఉండాలని చట్టంలో పేర్కొన్నారని వివరించారు. కానీ ఇందుకు వ్యతిరేకంగా ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, నియామకాలు, శిక్షణ శాఖ, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లు వ్యవహరించాయన్నారు. గతంలో యూపీఏ2 హయాంలో కూడా ఇలాంటి చట్టవిరుద్ధ పద్ధతులే అనుసరించారని పేర్కొన్నారు.