'అన్నింటికి అమ్మేంటి.. ఆ ప్రచారమేంటి?'
మదురై: తమిళనాడులో అమ్మ పేరిట పథకాలు రావడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పేర్లకు అమ్మ, పురుచ్చి తలైవి(విప్లవాత్మక నేత) అని చేర్చడం, ఆ పేరిట ప్రకటనలు ప్రచురించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీ రథినం అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మున్ముందు అలాంటి ప్రకటనలు అలాంటి పనులు చేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాలని అందులో కోరారు.
అంతేకాకుండా ప్రజల సొమ్మును ఇలా పథకాల పేరిట వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించకుండా ఉండేలా చూడాలని కోరుతూ కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రచారం చేసుకునేందుకే పథకాల పేర్లు పెడుతున్నారని, వాటి ప్రకటనల్లో కూడా ఆమె పేరును చేరుస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అమ్మ కాల్ సెంటర్, అమ్మ మైక్రో లోన్స్ స్కీమ్స్ అంటూ ప్రతిరోజు దినపత్రికల్లో వేల కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని కూడా పిటిషనర్ అందులో పేర్కొన్నారు.