బల్గేరియా నుంచి హుటాహుటిన వచ్చిన అజిత్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారన్న వార్త తెలియగానే ప్రముఖ హీరో అజిత్ బల్గేరియా నుంచి చెన్నైకి హుటాహుటిన వచ్చారు. జయలలిత గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించిన సమయంలో ఆయన బల్గేరియాలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ వార్త తెలియడంతో వెంటనే షూటింగ్ రద్దుచేసుకొని అజిత్ మంగళవారం అర్ధారాత్రికి చెన్నై చేరుకున్నారు. అప్పటికే మెరీనా బీచ్‌లో జయలలిత అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లిన అజిత్ ఆమెకు కన్నీటి నివాళులర్పించారు. అర్ధరాత్రి సమయంలో భార్య షాలినీతో కలిసి అజిత్ అమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు.
దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న తన తాజా చిత్రం షూటింగ్‌లో భాగంగా అజిత్ బల్గేరియాలో చిక్కుకుపోయాడని, అందుకే అమ్మ అంత్యక్రియలలోపు ఆయన రాలేకపోయారని, దీంతో విమానాశ్రయం నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి అజిత్ శ్రద్ధాంజలి ఘటించారని సన్నిహితులు తెలిపారు.
జయలలిత-హీరో అజిత్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అజిత్‌ను జయలలిత తన కొడుకుగా భావిస్తారని చెప్తారు. ఈ నేపథ్యంలో జయలలిత వారసుడిగా అన్నాడీఎంకేలో అజిత్ చేరే అవకాశముందని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావొచ్చునని అంటున్నారు. ఒక తరుణంలో జయలలిత వారసుడిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అజిత్ చేపట్టవచ్చునని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.