ముంబై : ఏదో పొరపాటుగా మాట్లాడాను అంటూ కేంద్రమంత్రి పియూష్ గోయల్ తను మాట్లాడిన దానికి వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఐన్‌స్టీన్ కనుగొన్నారని పొరపాటున చెప్పడంతో రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆయన తెగ ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘అయ్యో ఇన్ని రోజులు గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటన్ అనుకున్నాం.. కాదా?’ అంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనిపై పియూష్ గోయల్ స్పందించారు. మనందరం తప్పులు చేస్తుంటాం. తప్పు చేసిన దానిని సవరించుకోవడానికి నేను భయపడటం లేదు. నేను పొరపాటున ఒకరిపేరు మాట్లాడబోయి మరొకరి పేరును మాట్లాడాను అని చెప్పుకొచ్చారు.
అనుకోకుండా నేను చెప్పిన దాంట్లో ప్రధాన విషయం కాకుండా నేను పొరపాటుగా మాట్లాడిందే హైలెట్ అయిందని గోయల్ వాపోయారు. రాబోయే అయిదేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్లు గల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ముంబై నుంచి న్యూఢిల్లీల మధ్య అదనపు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించడానికి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘వైఫల్యాలు విజయానికి ఒక అడుగు, ఎవరైనా చేసిన తప్పులు భవిష్యత్తులో మంచిదానికి దారితీస్తాయని నేను భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment