
సాక్షి, న్యూఢిల్లీ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించని పక్షంలో మోదీ సర్కార్‌కు గడ్డుకాలం తప్పదన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆరునెలల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రధాని మోదీని యువత కర్రలతో బాదుతారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ గురువారం పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బదులిచ్చారు. కర్రల దాడిని తట్టుకునేలా తాను ప్రతిరోజూ చేసే సూర్య నమస్కారాల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నానని మోదీ అన్నారు.
గత 20 ఏళ్లుగా తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని ఇప్పుడు తనను తాను దందా-ప్రూఫ్‌గా రాటుతేలానని చెప్పుకొచ్చారు. ఎన్డీ ప్రభుత్వం ప్రదర్శించిన అంకిత భావం, చొరవతో దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి సమస్యలు కొలిక్కివచ్చాయని చెప్పారు. 2014 నుంచి 2019 వరకూ తమ ప్రభుత్వ పనితీరును మెచ్చిన ప్రజలు తమకు తిరిగి అధికారం కట్టబెట్టారని అన్నారు. తాము గత పాలకుల బాటలోనే పయనిస్తే ఆర్టికల్ 370 రద్దయ్యేది కాదని, ట్రిపుల్ తలాక్ సమస్య పరిష్కారమయ్యేది కాదని విపక్షాలకు మోదీ చురకలు వేసారు.