
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో ప్రధాని మోదీ మాట్లాడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఎంపీలు కలిగిన పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మాట్లాడతారు. కరోనా మహమ్మారిపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు చేపట్టాల్సిన దాని గురించి వారితో ప్రధాని చర్చించే అవకాశముంది. లాక్‌డౌన్ గడువు 14తో ముగియనుండటంతో ప్రధాని ఇంకా ఏమైనా చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?)
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వరుస భేటీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. సినీ, క్రీడా, మీడియా ప్రముఖులతో పాటు వైద్య సిబ్బందితోనూ ఆయన మాట్లాడారు. కరోనాను అడ్డుకునేందుకు మార్చి 24 నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్ పాటించాలని ప్రధాని పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పేసి కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ లైట్లు వెలిగించాలని ప్రజలను ప్రధాని మోదీ వీడియో సందేశంలో కోరారు. (ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment