కఠిన నిర్ణయానికి అస్సలు భయపడం : మోదీ
సాక్షి, యాంగన్: పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి సమర్థించుకున్నారు. దేశ ప్రయోజనాలకోసం తాము ఎంత కఠినమైన నిర్ణయమైన, ఎంత పెద్ద నిర్ణయం అయినా తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు. మయన్మార్ పర్యటనలో ఉన్న సందర్భంగా మోదీ ఈ విషయం చెప్పారు. రాజకీయాలకంటే దేశం గొప్పదని, అందుకే తాము అలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, సర్జికల్ దాడి, జీఎస్‌టీ ప్రారంభంలాంటివి తమ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయాలన్నారు.
నల్లధనం బయటకు తీసేందుకే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా కోట్ల ఆదాయం ఉండి కూడా ఆదాయపన్ను కట్టకుండా తప్పించుకుంటున్న లక్షలమందిని గుర్తించడానికి వీలయిందని తెలిపారు. గత మూడు నెలల్లో దాదాపు రెండు లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు చెప్పారు. ఈ కంపెనీలన్నీ కూడా బ్లాక్ మనీని వైట్‌మనీగా మారుస్తూ అక్రమాలకు పాల్పడేవే అని ఆయన గుర్తు చేశారు.