
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన విపక్షాలు ఈవీఎంల్లో లోపాలు అంటూ సాకులు వెతుకుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటమి అంగీకరించడం మినహా మరో మార్గం లేదని అన్నారు. మూడు దశల పోలింగ్ అనంతరం మాయాకూటమి పార్టీలు ఓటమిని గ్రహించి సాకులు వెతుకుతున్నాయని చెప్పారు.
జార్ఖండ్‌లోని లోహర్ధాగాలో బుధవారం జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ సైనికుల మనోస్ధైర్యాన్ని దెబ్బతీసేలా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, కులాలకు అతీతంగా దేశ ప్రజలందరి బాగోగులను చూడటమే కాపలాదారుగా తన కర్తవ్యమని చెప్పుకొచ్చారు. ఇరాక్‌లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న 46 మంది నర్సులను విడిపించేందుకు కృషిచేశామని, ఆప్ఘనిస్తాన్‌లో కోల్‌కతాకు చెందిన జుదిత్ డిసౌజా అపహరణకు గురైతే ఆమెను కాపాడామని గుర్తుచేశారు. బీజేపీ హయాంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించగలిగామని, యువత ప్రధాన జీవన స్రవంతిలో కలిసేందుకు హింసను విడనాడుతున్నారని అన్నారు.