► ప్రధాని మోదీ ఉద్ఘాటన
► ఉగ్రవాదానికి పాక్ ఊతమిస్తోందని ధ్వజం
న్యూఢిల్లీ: భారత్ అందరికీ స్నేహహస్తం చాస్తోందని, పాకిస్తాన్ దాన్ని అందుకోవాలంటే ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తోందని, ఉగ్రవాదులను రెచ్చగొడుతోందని తీవ్ర విమర్శలు సంధించారు. పాక్ ఉగ్ర ఆలోచన ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ప్రతిబంధకంగా మారిందన్నారు. ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్(అందరితో కలసి, అందరి క్షేమం కోసం) అన్నది కేవలం భారత్‌కు మాత్రమే కాక పొరుగుదేశాలకూ వర్తిస్తుంది.
ఈ ప్రాంతం పురోగతి సాధించకపోతే భారత్ అభివృద్ధి అసంపూర్ణం అవుతుంది.. ఇక్కడి అన్ని దేశాల ప్రజల ప్రగతి గురించి ఆలోచిస్తున్నాం. సహకారం కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. దీన్ని అందుకోవాలంటే ఉగ్రవాదానికి ముగింపు పలకాలి’ అని అన్నారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ అమరవీరుల కుటుంబాలను ఆ దేశ ప్రధాని హసీనా శనివారమిక్కడ సత్కరించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండా ఆ దేశంపై నిప్పులు చెరిగారు.
‘ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తూ, దాన్ని ప్రోత్సహించే ఒక ఆలోచన దక్షిణాసియాలో ఉంది. దాని విధానకర్తలు మానవత్వానికి కాకుండా ఉగ్రవాదానికి, అభివృద్ధి, సృష్టికి కాకుండా విధ్వంసానికి, విశ్వాసానికి కాకుండా వెన్నుపోటుకు ప్రాధాన్యమిస్తారు. సమాజానికి, దాని ఆర్థిక పురోగతికి ఈ ఆలోచన పెద్ద సవాల్’ అని పేర్కొన్నారు.
భారత్ ఆదర్శం..
బంగ్లా విముక్తి యుద్ధంలో 1,661 మంది భారత జవాన్లు బలిదానం చేశారని, ఆ యుద్ధంలో భారత పోరాటాన్ని మరచిపోకూడదని మోదీ అన్నారు. ‘భారత సైన్యం తన విధులను ఎన్నడూ విస్మరించకుండా యుద్ధ సంప్రదాయాలను పాటించి ఆదర్శంగా నిలిచింది. 1971 యుద్ధం తర్వాత 90 వేల మంది యుద్ధ ఖైదీలను సురక్షితంగా విడుదల చేసింది. ’ అని అన్నారు. నాటి యుద్ధంలో బంగ్లాలో ఒక తరాన్ని మొత్తం నిర్మూలించేందుకు పాక్ మారణకాండకు తెరతీసిందన్నారు.
అమాయకులను హతమార్చడమే కాకుండా బంగ్లాదేశ్ అనే భావననే నిర్మూలించడం ఈ హత్యాకాండ ఉద్దేశమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో హసీనా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ చరిత్ర బంగ్లా స్వతంత్రవీరుల రక్తంతోపాటు భారత అమరుల రక్తంతోనూ లిఖితమైందన్నారు. కార్యక్రమానికి ముందు మోదీ, హసీనాలు.. 1971లో పాకిస్తాన్ చెర నుంచి హసీనా తండ్రి, బంగ్లా వ్యవస్థాపకుడు ముజిబుర్ కుటుంబ సభ్యులను విడిపించిన మేజర్ అశోక్ తారాను కలిశారు. ఆయనతో వీరిద్దరూ ఫొటోలు దిగారు.