
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. తొలుత బుధవారం ఉదయం కేదార్‌నాథ్ చేరుకోనున్న ప్రధాని కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి ఆలయ పునర్నిర్మాణ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం దేశ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుని సైనికులతో ముచ్చటిస్తూ వారితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటారు.
కాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధానికి దీపావళి శుభాకాంక్షలు తెలపడంపై స్పందిస్తూ ప్రతి ఏటా దీపావళి రోజు తాను సరిహద్దులను సందర్శించి సైనికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతానని, ఈరోజు సైతం దివాళీ నాడు తమ వీర సైనికులతో సమయం వెచ్చిస్తానని, వీటికి సంబంధించిన ఫోటోలను రేపు సాయంత్రం షేర్ చేస్తానని మోదీ ట్వీట్ చేశారు.
2014లో ప్రధానిగా తొలి దీపావళిని ఆయన సియాచిన్‌లో సైనిక జవాన్లతో జరుపుకున్నారు. ఇక తదుపరి ఏడాది 1965 ఇండో-పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్ బోర్డర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 2016లో ఇండో-టిబెటన్ బోర్డర్‌లో సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌లో సైనికులతో మాటామంతీ నిర్వహిస్తూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment