
ఈ రెండు రోజులు ఎలా?
- మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
- రేపటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలపై చర్చ
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ, మంగళవారం నాటి బాలనేరస్తుల చట్టం సవరణ బిల్లు తప్ప ఇతర నిర్దేశిత అంశాలపై చర్చలేకుండానే పార్లమెంట్ శీతాకాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పార్లమెంట్ లోని బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు పార్టీ ఎంపీలు హాజరయ్యారు.
పార్లమెంట్ సమావేశాల చివరి రెండు రోజులైన మంగళ, బుధవారాల్లో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా నేడు రాజ్యసభ ముందుకు రానున్న బాలనేరస్తుల చట్టం సవరణ బిల్లుపై ఎలా స్పందించాలనేదానిపై పార్టీ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇది కాక ఉభయసభల్లో పెండింగ్ లో ఉన్న 18 బిల్లుల ఆమోదించుకునేందుకు ఏం చేయాలనేదానిపైనా చర్చించినట్లు సమాచారం.