వీడియో కాన్ఫరెన్స్‌లో అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడుతున్న మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛతా ఉద్యమంలో పాలుపంచుకునేవారు వారు గాంధీజీకి నిజమైన వారసులుగా నిలిచిపోతారని, జాతిపిత కలైన స్వచ్ఛ భారత్‌ను నిజం చేసేలా ప్రజలు పునరంకితం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. ఒంటరిగా ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించలేదని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. ‘స్వచ్ఛతా హీ సేవ’(స్వచ్ఛతే సేవ) ప్రచార ఉద్యమాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు.
వచ్చే నెల అక్టోబర్ 2 వరకూ ఇది కొనసాగుతుంది.పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశ ప్రజల్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 2, 2015న స్వచ్ఛతా సేవను ప్రధాని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు మత, ఆధ్యాత్మిక గురువులు, పలువురు ప్రముఖులతో దాదాపు రెండు గంటలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సంభాషించారు. అనంతరం ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని బీఆర్ అంబేడ్కర్ స్కూల్లో పరిసరాల్ని చీపురు పట్టి శుభ్రం చేశారు.
4.5లక్షల గ్రామాలు బహిర్భూమి రహితం
‘స్వచ్ఛ భారత్ ప్రాజెక్టు వల్ల గత నాలుగేళ్లుగా దేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు 40 నుంచి 90 శాతానికి విస్తరించాయి. సమాజంలోని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కేవలం నాలుగేళ్లలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 450 జిల్లాలు, 4.5 లక్షల గ్రామాలు బహిర్భూమి రహితంగా మారడాన్ని మీరు ఊహించారా? ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని ప్రధాని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2, 2018 నాటికి దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ బహిర్భూమి∙రహిత రాష్ట్రంగా మారనుందని స్వచ్ఛ భారత్ సర్వే వెల్లడించిందని గుర్తు చేశారు. ‘అక్టోబర్ 2019 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ 1.36 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం’ అని యోగి పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ ప్రభు త్వం చేపట్టిన చర్యల్ని మోదీ ప్రశంసించారు.
మీడియా కృషిని ప్రశంసించిన ప్రధాని
ప్రజల జీవన ప్రమాణాల్ని మెరగుపర్చడంలో స్వచ్ఛత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ‘పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వల్ల మూడు లక్షల మంది ప్రాణాల్ని కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. డయేరియా కేసులు 30 శాతం తగ్గుతాయి’ అని ఆయన వెల్లడించారు. అస్సాం, కేరళ, తమిళనాడు, బిహార్, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా రాష్ట్రాల ప్రజలతో మోదీ సంభాషించారు. కశ్మీర్‌లోని లేహ్ ప్రాంతంలో ప్యాంగాంగ్ సరస్సు శుద్ధిలో పాలుపంచుకుంటోన్న టిబెట్ సరిహద్దు పోలీసు బలగాలతో పాటు పట్నా సాహిబ్ గురుద్వారాకు చెందిన సిక్కు మతపెద్దలు, అజ్మీర్ షరీఫ్ దర్గాకు చెందిన ముస్లిం మతగురువులు, దైనిక్ జాగరణ్ మీడియా గ్రూపు సిబ్బందితో మోదీ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ప్రచారంలో వార్తా పత్రికలు, చానళ్లు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీలకు ప్రశంసలు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక వేత్త రతన్‌టాటాలు కూడా ప్రధానితో సంభాషించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ చేస్తున్న ప్రయత్నాల్ని కొనియాడారు. అలాగే తమిళనాడులో స్వచ్ఛ భారత్ ప్రచారంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పాలుపంచుకోవడాన్ని అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫరీదాబాద్‌లో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పట్నాలో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment