కెనడా పర్యటన చరిత్రాత్మకం
హిందూత్వం ఒక మతం కాదు.. జీవన విధానం
వాంకోవర్‌లో మోదీ వ్యాఖ్యలు; ముగిసిన మూడుదేశాల టూర్
వాంకోవర్/న్యూఢిల్లీ: కెనడాలో తన పర్యటన చరిత్రాత్మకమైనదని భారత ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ఈ పర్యటనతో ద్వెపాక్షిక సహకారంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ‘ఒక పర్యటన ప్రాముఖ్యత అది ఎంతకాలం సాగిందనేదానిపై కాకుండా అది సాధించిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటన చరిత్రాత్మకం. 42 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కెనడా పర్యటనకు వచ్చినందుకు కాదు.. 42 ఏళ్ల తరువాత ఇరుదేశాల మధ్య నెలకొన్న దూరం ఒక్క క్షణంలో మాయమైనందుకు ఈ పర్యటన చరిత్రాత్మకం’ అని పేర్కొరు. భారత్ బయల్దేరే ముందు శుక్రవారం కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ తన గౌరవార్ధం ఇచ్చిన విందులో మోదీ పాల్గొన్నారు. కొన్నాళ్లుగా సరిగాలేని రెండు దేశాల సంబంధాలు మళ్లీ సరైన గాడిలో పడినందువల్ల తన పర్యటన విజయవంతమైందని భావిస్తున్నానన్నారు.
‘ఇరుదేశాల మధ్య ఇన్నాళ్లూ ఉన్న అడ్డుగోడ ఇప్పుడు సత్సంబంధాల వారధిలా మారింది’ అని అన్నారు. కీలకమైన రెండు ఒప్పందాలను.. ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక పరిరక్షక ఒప్పందం, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం త్వరలోనే కొలిక్కి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో కలసిరావడం వల్ల కెనడా కూడా ప్రయోజనం పొందుతుందని తెలిపారు. స్వామి వివేకానంద 1893లో సర్వమత సమ్మేళనంలో పాల్గొనేందుకు షికాగో వెళ్తూ మార్గమధ్యంలో వాంకోవర్‌లో ఆగిన విషయాన్ని ఇరువురు గుర్తుచేసుకున్నారు.
దేవాలయాల సందర్శన: అంతకుముందు హార్పర్‌తో కలసి మోదీ వాంకోవర్‌లోని గురుద్వారాను, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. హిందూత్వం మతం కాదని, అది ఒక జీవన విధానమని మోదీ వ్యాఖ్యానించారు. ‘హిందూ ధర్మానికి భారత సుప్రీంకోర్టు అద్భుత నిర్వచనాన్ని ఇచ్చింది. హిందూత్వం మతం కాదని జీవన విధానమని స్పష్టం చేసింది’ అన్నారు. భారత స్వాతంత్య్ర పోరులో భగత్‌సింగ్ సహా సిక్కుల పాత్రను ప్రస్తావించారు.
ముగిసిన పర్యటన: ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో ప్రధాని మోదీ 9 రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసిం ది. పెట్టుబడులు, మేక్ ఇన్ ఇండియాకు ప్రచారం, పలు ద్వైపాక్షిక అంశాల్లో సహకారం.. ప్రధాన లక్ష్యాలుగా మోదీ పర్యటన సాగింది. ఫ్రాన్స్‌తో రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, జర్మనీలో మేక్ ఇన్ ఇండియాకు లభించిన మద్దతు, యురేనియం సరఫరాకు కెనడా అంగీకారం.. మోదీ పర్యటనలో కీలక విజయాలుగా పేర్కొనవచ్చు.
పీఎంవి.. ఆరెస్సెస్ ప్రచారక్‌వి కాదు: కాంగ్రెస్
విదేశాల్లో మోదీ వ్యతిరేక ప్రచారాన్ని తామూ ప్రారంభిస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. కెనడాలో యూపీఏ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘ఆరెస్సెస్ ప్రచారక్‌లా కాకుండా ప్రధానిలా వ్యవహరించండ’ని సలహా ఇచ్చింది. ‘ఈ సారి మోదీ విదేశాలకు వెళ్లి ఇలాగే వ్యవహరిస్తే.. మా తరఫున ఒకరు వెళ్లి వెంటనే తగిన జవాబిస్తారు’ అని పార్టీ నేత ఆనంద్ శర్మ చెప్పారు. ‘గతంలో అనుమతి లభించకపోవడంతో పర్యటించలేని దేశాలనన్నింటికీ ఇప్పుడు వెళ్తున్నారేమో’ అంటూ మోదీపై సీపీఎం నేత సీతారాం ఏచూరి చురకలేశారు.
శక్తిమంతులైన నేతల సారథ్యంలో భారత్, చైనా
న్యూయార్క్: శక్తిమంతులైన నేతల సారథ్యంలో భారత్, చైనాలు దూసుకువెళ్తున్నాయని ‘టైమ్’ మేగజీన్ పేర్కొంది. స్ఫూర్తిదాయక నాయకత్వంతో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చరిత్రలో తమ ముద్ర వేసేందుకు తహతహలాడుతున్నారని తాజా సంచికలోని కథనంలో వ్యాఖ్యానించింది.
‘మోదీకి ముందు మన్మోహన్ వెళ్లారు’
న్యూఢిల్లీ: గత 42 ఏళ్లలో కెనడాలో పర్యటించిన తొలి భారత ప్రధానిని తానేనని మోదీ చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధాని హోదాలో 2010 జూన్ 26 నుంచి 28 వరకు కెనడాలో మన్మోహన్‌సింగ్ అధికారిక పర్యటన జరిపారని గుర్తు చేసింది. కెనడా ప్రధాని హార్పర్ ఆహ్వానంపై మన్మోహన్ కెనడాలో పర్యటించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ తెలిపారు.