'ఆర్డినెన్స్పై అనవసర రాద్దాంతం వద్దు'
న్యూఢిల్లీ : పోలవరం ఆర్డినెన్స్పై అనవసర రాద్దాంతం వద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హితవు పలికారు. యూపీఏ నిర్ణయాన్నే తాము అమలు చేశామని ఆయన గురువారమిక్కడ తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం మంచిదికాదని, తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడే ఆర్డినెన్స్ రూపొందిందన్నారు. తమకు రెండు ప్రాంతాలు సమానమేనని వెంకయ్యనాయుడు తెలిపారు.
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు మెజార్టీ పార్టీలు ఒప్పుకున్నాయని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిల్లు పాస్ అయినప్పుడు టీఆర్ఎస్ లాంటి పార్టీలు సంబరాలు చేసుకున్నాయని, ఇప్పుడు విమర్శించటంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో వివాదానికి ఆస్కారం లేదని వెంకయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై శ్రద్ధ తీసుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రతీ అంశాన్ని అమలు చేస్తామని వెంకయ్య తెలిపారు.