‘పోలవరం’ను సమష్టిగా వ్యతిరేకిద్దాం
మూడు రాష్ట్రాల ఎంపీల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2014ను అడ్డుకునేందుకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు సమాయత్తమవుతున్నారు. బిల్లును సమన్వయంతో, సమష్టిగా వ్యతిరేకించాలని వారు నిర్ణయించారు. ఈ మేరకు వ్యూహాన్ని తయారు చేసేందుకు ఇక్కడి కానిస్టిట్యూషన్ క్లబ్‌లో గురువారం రాత్రి ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి 10 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు, ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు, ఒడిశా నుంచి బీజేడీ లోక్‌సభాపక్ష నేత సహా ఐదుగురు ఎంపీలు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఒక ఎంపీ పాల్గొన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లో కలపకుండా, గిరిజన గ్రామాలను తరలించకుండా చూడాలని నిర్ణయించుకున్నారు.
మాటల్లో సమదృష్టి.. చేతల్లో వివక్ష!
అభివృద్ధి విషయంలో రెండు రాష్ట్రాలపై సమదృష్టి పెడతామని చెప్పిన కేంద్రప్రభుత్వం.. బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష చూపిందని టీఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యులు విమర్శించారు. ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని, నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయు డు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మాటలు నమ్మి తెలంగాణకు అన్యాయం చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వారు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏడు ప్రాజెక్టులివ్వడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం తమను బాధిస్తోందన్నారు.