
థానే: "మనం ఇంట్లో ఉండి కరోనాను తరిమికొడదాం" అని ప్రభుత్వమిస్తున్న నినాదాలు కొందరి చెవికెక్కట్లేదు. అవసరమున్నా లేకపోయినా, చీటికీమాటికీ రోడ్ల మీదకు వస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎన్ని రకాలుగా చెప్పినా లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఇలాంటి వారికి హారతిచ్చి మరీ ప్రస్తుత పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చెప్తూనే బయటకు రావద్దంటూ పోలీసులు సూచనలిస్తున్నారు. ఈ కొత్త తరహా పనిష్మెంట్ మహారాష్ట్రలోని థానేలో విధించారు. (మరో కొన్నిగంటల్లో ఇంటికి చేరుతుందనగా..)
వివరాల్లోకి వెళితే.. థానేలో మంగళవారం ఉదయం పూట కొంతమంది మార్నింగ్ వాక్ కోసం రోడ్ల మీదకు వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డగించగా కారణం తెలుసుకుని నివ్వెరపోయారు. ఇలాంటి ప్రమాద పరిస్థితుల్లో మార్నింగ్ వాక్ ఏంటని ప్రశ్నించారు. ఇంతలో ముఖానికి మాస్కు ధరించి ఉన్న ఓ మహిళా పోలీసు హారతి పళ్లెంతో వారి ముందుకు వచ్చింది. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యువకులందరికీ హారతి పడుతూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పకనే చెప్పింది. ఈ హారతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇరుకు బతుకుల్లో ఊపిరాడేనా?)