లాలూ ర్యాలీ... సక్సెస్ అయ్యేనా?
లాలూ ర్యాలీ... సక్సెస్ అయ్యేనా?
Published Mon, Aug 21 2017 4:39 PM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM
పట్నా: ప్రస్తుతం రాజకీయ వర్గాల చూపంతా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నిర్వహించబోయే ర్యాలీ మీదే ఉంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై పోరాడాలన్న మాజీ ముఖ్యమంత్రి పిలుపునకు ఏ మేర స్పందన వస్తుందో తిలకించేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే చివరి నిమిషంలో కీలక నేతలంతా ఒక్కోక్కరుగా హ్యాండిస్తూ వస్తుండటం లాలూను కంగారు పెడుతోంది.
తమ ప్రత్యర్థులతో వేదికను పంచుకోవటం ఇష్టం లేని పలువురు నేతలు ర్యాలీకి గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. సమాజ్ వాదీ తరపున అఖిలేష్ యాదవ్ హాజరవుతుండటం ఖాయం కావటంతో బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయవతి తన స్థానంలో సీనియర్ నేతను పంపేందుకు సిద్ధం అయ్యారు. ఇక వామపక్షాలు కూడా ర్యాలీలో పాల్గొంటుండటంతో తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతినిధిగా వ్యవహరించటం ఖాయమైపోయింది. అనారోగ్యం కారణంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా కార్యక్రమానికి హాజరుకావటం అనుమానంగానే ఉందని చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్‌తో ఏర్పడిన లుకలుకల కారణంగానే ఆయన రావట్లేదన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ర్యాలీకి పెద్దన్నగా వ్యవహరించబోతున్న జేడీయూ సీనియర్ నేత శరద్‌యాదవ్ అంశం మరీ ప్రత్యేకంగా మారింది. ఆయన ర్యాలీలో గనుక పాల్గొంటే వెంటనే పార్టీ నుంచి బహిష్కరించేందుకు పార్టీ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ సిద్ధంగా ఉన్నారు. మహాకూటమిని కాదనుకుని మరీ బీజేపీతో చేతులు కలిపిన నితీశ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న శరద్ వేటుపడినా సరే లాలూతో చేతులు కలిపేందుకే ఉత్సుకత చూపుతుండటం గమనార్హం.
ఇలా నిన్న మొన్నటిదాకా మోదీకి వ్యతిరేకంగా గళం వినిపించిన వాళ్లు, రాజకీయ వైరిల నేపథ్యంలో వెనకంజ వేయటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో లాలూ ర్యాలీ సక్సెస్ అవుతుందా?, 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వినిపిస్తున్న ‘బీజేపీ హఠావో.. దేశ్ బచావో’. అన్న నినాదం వర్కవుట్ అవుతుందా? అన్నది అనుమానంగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement