
ఉపఎన్నికల్లో ‘అధికార’ హవా
ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నవంబర్ 19న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు ఆధిపత్యం నిలుపుకున్నాయి.
రెండేసి లోక్‌సభ స్థానాల్లో గెలిచిన బీజేపీ, టీఎంసీ
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నవంబర్ 19న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు ఆధిపత్యం నిలుపుకున్నాయి. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ రెండు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రెండు సీట్లు గెలిచాయి. పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహర్, తమ్లుక్ లోక్‌సభ, మోంటేశ్వర్ అసెంబ్లీ స్థానాలను టీఎంసీ కై వసం చేసుకుంది. అస్సాంలోని లఖిన్‌పూర్ లోక్‌సభ, భైతలంగ్సో అసెంబ్లీ.. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ, నేపనగర్ అసెంబ్లీ స్థానాలను అధికార బీజేపీ చేజిక్కించుకుంది.
తమిళనాడులోని అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం అసెంబ్లీ స్థానాల్లో ఏఐఏడీఎంకే గెలిచింది. పుదుచ్చేరిలోని నెల్లితోపులో కాంగ్రెస్ పార్టీ సీఎం వి.నారాయణ స్వామిని విజయం వరించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని హయూలియాంగ్ అసెంబ్లీ స్థానంలో.. ఆత్మహత్య చేసుకున్న మాజీ సీఎం కలికో పుల్ భార్య డసాంగ్లు బీజేపీ తరపున గెలిచారు. త్రిపురలోనూ అధికార సీపీఎం బర్జల, ఖొవాయ్ అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. బీజేపీకి ఓటేసిన వారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.