
చరిత్ర సృష్టించిన 'మఫ్లర్ మేన్'
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరిష్మా , సామాజిక కార్యకర్తగా గుర్తింపుపొందిన కిరణ్ బేడీ క్లీన్ ఇమేజ్ పనిచేయలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరిష్మా , సామాజిక కార్యకర్తగా గుర్తింపుపొందిన కిరణ్ బేడీ క్లీన్ ఇమేజ్ పనిచేయలేదు. 'మఫ్లర్ మేన్' అరవింద్ కేజ్రివాల్ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించి చరిత్ర సృష్టించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ‘చీపురు’ దుమ్ము రేపింది. రెండు నెలల ముందు వరకు బీజీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలతో పాటు మీడియా కూడా అంచనా వేసింది. పోలింగ్ రోజుకు కేవలం రెండు వారాల ముందే ఈ అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇరుపార్టీల జయాపజయాలకు దారితీసిన కారణాలు...
ఆప్ విజయానికి.... కారణాలేమిటీ?
1. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా పక్కా ముందస్తు ప్రణాళికతో ముందుకె ళ్లారు. అందులో భాగంగా ఏడు నెలల ముందే పార్టీ ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటుచేసి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేశారు. పట్టణ మధ్య తరగతి కుటుంబాలను, గ్రామీణ పేదలతోపాటు యువత, మహిళలను ఆకర్శించేందుకు తగిన కసరత్తు చేశారు.
2. ఢిల్లీ డైలాగ్ పేరిట ప్రజలతో ముఖాముఖి చర్చలు జరపడం ద్వారా వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి ఎన్నికల మేనిఫెస్టోలో తగిన ప్రాధాన్యత కల్పించారు. మహిళల రక్షణకు, యువత ఉపాధికి, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి హేతుబద్ధమైన హామీలు ఇచ్చారు.
3. భారీ ర్యాలీలకు బదులుగా ఐదారు వేల మందితో ‘జనసభ’లు ఏర్పాటు చేసి ఆకాశాన్నంటున్న ఆహార, ప్రాణాధార మందుల ధరలపై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో ఆప్ మొత్తం 700 జనసభలు నిర్వహించగా, వాటిలో 110 సభల్లో కేజ్రివాల్ పాల్గొన్నారు.
4. సామాజిక వెబ్‌సైట్లలో పార్టీ ప్రచారానికి 16 మంది సభ్యులతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సందేశాలు పంపించారు. ఎన్నికల ప్రచార కమిటీ సూచనలను పరిగణలోని తీసుకొని పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు.
బీజేపీ పరాజయానికి....
1. రుజువర్తన కలిగిన వ్యక్తిగా క్లీన్ ఇమేజ్ కలిగిన కిరణ్ బేడీ బీజేపీలో చేరడాన్ని ఢిల్లీ ఓటర్లు జీర్ణించుకోలేదు. పైగా ఆమె రాక పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీయడం. కృష్ణ తీరథ్ లాంటి సీనియర్ నాయకులతో సమన్వయం కుదురలేదు.
2.గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించిన హర్షవర్దన్ లాంటి స్థానిక నాయకుడు లేరు.
3 ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. మేనిఫెస్టోకు బదులుగా విజిన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.
4. పార్టీ సీనియర్ నాయకులను, కేంద్ర మంత్రులను ప్రచార రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. కారణం వారెవరూ స్థానిక నాయకులు కాకపోవడం వల్ల వారెవరికీ స్థానిక సమస్యలపై పట్టులేక పోయింది. ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆలస్యంగా ప్రారంభించారు.
5. మోదీ చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం కేవలం నినాదం మాత్రంగా మిగిలిపోయే జిమ్మిక్కని ప్రజలు భావించడం, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల భారత్‌కు వచ్చినప్పుడు మోదీ 30 లక్షల రూపాయలు విలువచేసే కోటు ధరించారనే ప్రచారమూ ప్రతికూల ప్రభావం చూపించింది.
-నరేందర్ రెడ్డి
నెట్ డెస్క్