
కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా సెన్సేషన్, కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె నటించిన లేటెస్ట్ మలయాళ మూవీ ‘ఒరు ఆదార్ లవ్’ లోని ఓ పాటలోని వీడియో సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో ఇటీవల పోలీస్ కేసు నమోదైంది. అయితే తమ మూవీ యూనిట్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అత్యవసరంగా రేపు (మంగళవారం) తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశం ఉందని ప్రియా ప్రకాశ్ ఆశిస్తోంది. ఇదిలాఉండగా.. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతోపాటుగా ఈ మూవీలోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ మహారాష్ట్రలోనూ పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
కొన్నిరోజుల కిందట దేశవ్యాప్తంగా మీడియాలో ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఇందుకు కారణంగా ‘ఒరు ఆదార్ లవ్’ మూవీ 'మాణిక్య మలరాయ పూవి' పాటలోని సన్నివేశాలు. హీరోయిన్ కనుబొమ్మలను ఎగరేయడం, కన్ను కొడుతూ హీరోకు బదులిస్తున్న వీడియో సంచలనంగా మారింది. దీంతో మూవీ యూనిట్‌కు కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుండగా.. మూవీ యూనిట్‌పై నమోదైన కేసుల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని నటి ప్రియా ప్రకాశ్ వారియర్ భావిస్తోంది. కేసులను త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్న ప్రియా ప్రకాశ్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌పై రేపే (మంగళవారం) విచారణ జరగవచ్చునని అశిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment