
అలా పిలవడమే తప్పు
న్యూఢిల్లీ: హీరోయిన్ కేంద్రంగా నడిచే కథా చిత్రాలన్నింటినీ ‘లేడీ ఓరియెంటెడ్ సినిమా’గా పిలవడం మామూలే. అయితే ప్రియాంకా చోప్రాకు మాత్రం ఈ పిలుపు నచ్చడం లేదు. ఒక సినిమా మంచీచెడును దాని కథ ఆధారంగా నిర్ణయించాలె తప్ప పాత్రలతో కాదని ఈమె చెప్పింది. బాక్సర్ మేరీకోమ్ జీవితగాథ ఆధారంగా అదే పేరుతో రూపొందించిన సినిమాలో ఈ బ్యూటీ ప్రధానపాత్ర పోషించడం తెలిసిందే.
మేరీకోమ్ శుక్రవారమే విడుదలయింది. ‘సినిమాల్లో మహిళాపాత్రధారికి అమిత ప్రాధాన్యం ఇస్తూ వివక్ష చూసే సంస్కృతి బాలీవుడ్, మీడియాలో ఇప్పటికీ ఉంది. దీనివల్ల ఆమె ప్రతిభ కనుమరుగువుతుంది. అందుకే నాకు ‘లేడీ ఓరియెంటెడ్’ అనే పదమే నచ్చదు. ఇది హీరోయిన్ ప్రతిభ, శ్రమను పట్టించుకోదు. మామూలుగా హీరో నటిస్తే దానికి ఎంతమాత్రమూ ప్రాధాన్యం ఉండదు. అదే హీరోయిన్ కీలకపాత్రలో ఉంటే ఆ సినిమాకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. ఇలా ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం.
మా నటన, శ్రమ ఆధారంగా గుర్తింపు ఇవ్వండి. హీరోల సినిమాల్లాగే మా చిత్రాలనూ విమర్శించండి లేదా ప్రశంసించండి’ అని ప్రియాంక చెప్పింది. మనదేశంలో ఇది వరకే బాలికలపై వివక్ష ఉందని, ఈ విషసంస్కృతి బాలీవుడ్‌లోనూ కొనసాగుతూనే ఉందని విచారం వ్యక్తం చేసింది. సినీప్రముఖులు ముందుగా వారి రంగంలోని వివక్షను నిర్మూలించగలిగితేనే దేశంలోనూ దీనిని తొలగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.
ఒలింపిక్ పతకం సాధించడానికి మేరీకోమ్ పడ్డ కష్టాన్ని ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుందని, ఇది ప్రతి ఒక్కరికీ ఇది స్ఫూర్తిదాయక చిత్రమని జాతీయ అవార్డు గ్రహీత కూడా అయిన ఈ 32 ఏళ్ల బ్యూటీ చెప్పింది. మనల్ని ఎప్పుడూ నిరుత్సాహపర్చేవారు అంతటా ఉంటారని, వీరిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని యువతకు ప్రియాంకా చోప్రా పిలుపునిచ్చింది.