
యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ!
రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి వాదన రావడం సహజమే అయినా, గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగడం కలసి వస్తుందన్న ప్రచారం బాగా జరగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆమెను ఎన్నికల సమరంలోకి తీసుకొచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి.
యూపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీని కూడా రంగంలోకి దింపితే విజయావకాశాలు బాగా మెరుగుపడతాయని ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్న పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ విషయంలో అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి ఫీలర్లు వెలువడలేదు.