ముంబై: యాసిడ్ బాధితులకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్టు యాసిడ్ సర్వైవర్స్ ఫౌండేషన్ ప్రకటించింది. 'ప్రాజెక్ట్ రివైవ్' పథకం కింద మార్చి 1నుంచి 12 వ తేదీవరకు ఢిల్లీలో ఉచితంగా ఈ ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇందులో నాగాలాండ్, మిజోరం, కాశ్మీర్ వంటి రిమోట్ మరియు సుదూర ప్రాంతం సహా దేశంలోని బాధితులకు ఈ చికిత్స అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఈ ప్రాజెక్టు కోసం దేశ విదేశాలకు చెందిన ప్లాస్టిక్ సర్జన్లు, సంబంధిత నిపుణులు పనిచేస్తున్నారని ఎఎఫ్ఎస్ఐ మేనేజర్ మేఘ మిశ్రా తెలిపారు. దీనికి వాట్సాప్, ఇమెయిల్ ద్వారా బాధితులు ఫోటోలను పంపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా ఈ సర్జరీల ప్రీ స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు. బాధితులను పూర్తిగా పరిశీలించిన మీదట ఎలాంటి చికిత్స అందించేది నిర్ణయిస్తామని తెలిపారు. దీంతోపాటుగా, ప్రీ అండ్ పోస్ట్ ఆపరేషన్ కేర్తోపాటు, దీర్ఘకాలం చికిత్స అవసరమైన వారికి వసతి సౌకర్యాలను 100 శాతం ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నెల 29 లోగా బాధితుల తమ వివరాలను 9711668882 అనే నెంబరుకు వాట్సాప్ ద్వారా గానీ, మిశ్రా డాట్ మేఘ09@ జీమెయిల్.కామ్ పంపించాలని కోరారు.
యాసిడి బాధితుల సహాయార్ధం తాము చేపట్టిన ప్రచారానికి అమెరికా , కెన్యా, అస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని మిశ్రా చెప్పారు. కేవలం వైద్య సహాయం మాత్రమేకాకుండా.. బాధితులకు అవగాహనా కార్యక్రమాలను కూడా తమ సంస్థ చేపడుతుందని ఆమె తెలిపారు.