పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యత్నం
చెన్నై: జయలలిత మృతిచెందిన తర్వాత తమిళనాడు రాజకీయాలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి ఉదయం తమిళనాడు అసెంబ్లీ సమావేశం కావడం.. శశికళకే పార్టీ పగ్గాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వదంతులు ప్రచారమయ్యాయి. శశికళను పార్టీ చీఫ్ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అన్నాడీఎంకే కార్యకర్తలు పోయెస్ గార్డెన్ వద్ద ఆందోళనకు దిగారు. కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
గత సోమవారం రాత్రి జయ మృతిచెందగా ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ.పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, ఆపై అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత నెచ్చెలి శశికళ బాధ్యతలు తీసుకున్నారు. జయ మరణానంతరం ఆమె స్నేహితురాలు శశికళ పోయెస్ గార్డెన్ లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పన్నీరు సెల్వం ఇప్పటికే రెండుసార్లు పోయెస్ గార్డెన్‌కు వెళ్లి శశికళతో సమావేశమయ్యారు. కొందరు సీనియర్ నేతలు కూడా శశికళకు బాధ్యతలు ఇవ్వడంపై సముఖంగా లేరని తెలుస్తోంది. పార్టీ నేతలు మాత్రం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా శశికళ పేరును ప్రకటించకపోవడం గమనార్హం.