
ఢిల్లీలోని జఫ్రాబాద్‌లో సీఏఏ నిరసనకారులు, మద్దతుదారులు రాళ్లు రువ్వుకుంటున్న దృశ్యం
న్యూఢిల్లీ/అలీగఢ్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్‌లో ఆదివారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మౌజ్‌పూర్‌లో రెండు సమూహాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. భద్రత కారణాలతో మౌజ్‌పూర్, బదర్‌పూర్ మెట్రో స్టేషన్లను మూసివేశారు. 500 మందితో కూడిన బృందం శనివారం జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ధర్నా చేసింది. ఈ నేపథ్యంలోనే వారు ఆదివారం నిరసన కొనసాగించారు. ఇటు సీఏఏకు మద్దతుగా ఆదివారం స్థానిక బీజేపీ నేత కపిల్ మిశ్రా నేతృత్వంలో ఓ వర్గం మౌజ్‌పూర్‌లో ర్యాలీ ప్రారంభించింది. ఇరు వర్గాలు ఒక దగ్గరికి చేరడంతో ఘర్షణ రేగింది.
యూపీలోనూ ఘర్షణ: సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో చేపట్టిన నిరసన కారుల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఆదివారం మధ్యాహ్నం అలీగఢ్ జిల్లా కొట్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అప్పర్ కోట్ ఏరియాలో నిరసనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. మహ్మద్ అలీ రోడ్డు ప్రాంతంలో శనివారం నుంచే కొందరు మహిళా నిరసన కారులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో∙ఆదివారం సాయంత్రం ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు రోడ్డుపై నుంచి తప్పించే క్రమంలో ఘర్షణ తలెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment