
ట్యాంపరింగ్ నిరూపించండి
- ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు ఈసీ సవాల్
- జూన్ 3 నుంచి మొదలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని వచ్చిన ఆరోపణలను నిరూపించాలని రాజకీయ పార్టీలతో బహిరంగ సవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈమేరకు సవాల్ జూన్ మూడో తేదీ నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ చెప్పారు. ఇందులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న రాజకీయ పార్టీలు ఈ నెల 26 వ తేదీ సాయంత్రంలోగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ముగ్గురు నిపుణులతో వచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి నిరూపించాలన్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలలో పాల్గొన్న రాజకీయ పార్టీలకే అవకాశమిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు విదేశీ నిపుణుల సాయం తీసుకోరాదని తేల్చి చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయని ఫిర్యాదులు అందాయని, అందుకు సరైన ఆధారాలు లేవన్నారు. ఈవీఎంలలో వైఫై చిప్ ఉండదని, అందువల్ల బయటనుంచి ఆదేశాలను తీసుకునే అవకాశం లేదన్నారు.
పరువు, ప్రతిష్టకు పోరాదు
ఈవీఎంల ట్యాంపరింగ్ సవాల్‌ను రాజకీయ పార్టీలు పరువు మర్యాదల విషయంగా పరిగణించరాదని జైదీ సూచించారు. తాము నియమించే సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ట్యాంపరింగ్ జరిగిందో లేదని నిర్ధారిస్తుందని తెలిపారు. ఈ సవాల్ సుమారు 4–5 రోజులు కొనసాగొచ్చని పేర్కొన్నారు. ఈవీఎం యంత్రాన్ని హ్యాక్ చేయడానికి ప్రతి పార్టీకి నాలుగు గంటల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్ ఓటింగ్ ప్రవేశపెట్టడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నసీం జైదీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ గోప్యతను కాపాడే భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకునే తానిలా చెబుతున్నానని అన్నారు.
భద్రతకు ఢోకా లేదు
ఈవీఎంలలో ఉన్న సాంకేతికత భద్రతా ప్రమాణాలపై హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లోని ప్రముఖ సాంకేతిక నిపణులతో పరీక్షలు చేయిస్తున్నామని జైదీ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామనే ఆరోపణలను కొట్టివేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామని, ఆయా పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఈవీఎంల వినియోగం, వీవీప్యాట్ పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఒక నమూనా ప్రదర్శన నిర్వహించింది.