గూగుల్ సెర్చిలో టాపర్ ఎవరో తెలుసా? | PV Sindhu top searched Indian athlete in google | Sakshi
Sakshi News home page

గూగుల్ సెర్చిలో టాపర్ ఎవరో తెలుసా?

Published Fri, Aug 19 2016 6:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

గూగుల్ సెర్చిలో టాపర్ ఎవరో తెలుసా?

గూగుల్ సెర్చిలో టాపర్ ఎవరో తెలుసా?

భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్‌లో ఏ అంశం గురించి సెర్చ్ చేశారో తెలుసా.. పీవీ సింధు గురించి. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో సింధు ఆడుతుండటంతో ఆమె గురించిన వివరాలు తెలుసుకోడానికి ఎక్కువగా ఆమె పేరు సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో ఇప్పటికే రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌ను వెతికారు. ప్రపంచ నెంబర్ 6 ర్యాంకర్ నొజొమి ఒకుహరాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్న పీవీ సింధు భారతదేశంలో అతి ఎక్కువగా సెర్చ్ అయిన అథ్లెట్ సింధుయేనని గూగుల్ సంస్థ తెలిపింది. ఆ తర్వాత వరుసగా సాక్షి మాలిక్, కిదాంబి శ్రీకాంత్, దీపా కర్మాకర్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, వినేష్ ఫోగట్, లలితా బాబర్, వికాస్ యాదవ్, నర్సింగ్ యాదవ్‌లు నిలిచారు. భారతీయులు ఎక్కువగా బ్యాడ్మింటన్ గురించి, ఆ తర్వాత రెజ్లింగ్ గురించి సెర్చ్ చేశారట. ఒలింపిక్స్‌లో మన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శన తర్వాత ఆ అంశం గురించి కూడా బాగానే వెతికారంటున్నారు. గత వారం రోజుల్లో ఒలింపిక్స్ గురించి ఎక్కువగా వెతుకుతున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉంది.

కేవలం మనవాళ్ల గురించే కాదు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసేన్ బోల్ట్ గురించి కూడా వివరాలు తెలుసుకోడానికి భారతీయులు ప్రయత్నించారు. ఇక విదేశీ క్రీడాకారుల విషయానికొస్తే, బోల్ట్ తర్వాత శ్రీకాంత్‌ను ఓడించిన చైనా షట్లర్ లిన్ డాన్, సింధు చేతిలో ఓడిన ఒకుహరా, బంగారు చేప మైఖేల్ ఫెల్ప్స్, చైనా షట్లర్ వాంగ్ యిహాన్ తదితరుల గురించి భారతీయులు బాగానే గూగులమ్మను అడిగినట్లు తేలింది.

దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఈశాన్య రాష్ట్రాల వారికి ఒలింపిక్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు ఈ సెర్చ్‌లో తేలింది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్.. ఈ ఆరు రాష్ట్రాలలో నెటిజన్లు రియో గేమ్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. టాప్ 10 రాష్ట్రాలలో ఇంకా గోవా, పుదుచ్చేరి, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నట్లు గూగుల్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement