భారత గళానికి ప్రతినిధి ఎవరు?!
ఈ వారం దేశ రాజకీయాలు హై వోల్టేజ్ కరెంటులా కొనసాగాయి. ముఖ్యంగా ముగ్గురి ప్రసంగాలు ప్రజలను అమితంగా ఆకర్షించాయి. దేశభక్తి, దేశప్రగతి, భావప్రకటన స్వేచ్ఛల చుట్టూ తిరిగిన వీరి వాదనలు, విమర్శలను ప్రజలు పత్రికల్లో, ప్రత్యక్ష ప్రసారాల్లో గమనించారు. ఆ ముగ్గురు.. ప్రధాని మోదీ, విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్!! మోదీ ప్రభుత్వం ముంబై దాడుల కేసు, నల్లధనం వెలికితీత వంటి అనేక అంశాల్లో విఫలమైందని రాహుల్ పార్లమెంటులో దాడి చేశారు. జేఎన్‌యూ, రోహిత్ అంశాలను ప్రచారం చేశారు.
మోదీ కూడా దీటుగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేశారు. అయితే జేఎన్‌యూ, రోహిత్ విషయాల జోలికి పోలేదు. ఈ రెండు అంశాలతో ప్రచారంలోకి వచ్చి, జైలు కెళ్లిన కన్హయ్య మాత్రం ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించారు. తొణకని స్వరంతో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. మరి మోదీ, రాహుల్, కన్హయ్యల్లో ఎవరి స్వరం దేశ గళంలా మారింది? ఈ ప్రశ్నకు మేధావులు, మీడియా, నెటిజన్లలో అత్యధిక శాతం కన్హయ్యకే ఓటేస్తున్నారు.
అతడు ఈ దేశ యువత ఆకాంక్షలకు ప్రతినిధి అంటున్నారు. దేశానికి కన్హయ్యలాంటి నాయకుడు కావాలని స్క్రోల్ వంటి ఆన్‌లైన్ పత్రికలు కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ ఈ వారంలో ఏమేం అన్నారో క్లుప్తంగా..
* ముంబై దాడుల తర్వాత యూపీఏ ప్రభుత్వం కష్టపడి పాకిస్తాన్‌ను బోనులో పెడితే, మోదీ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కప్పు టీ కోసం దాన్ని విడిపించేశారు. యూపీఏ ఆరేళ్ల కష్టాన్ని ఒక్క చేత్తో బూడిదపాలు చేశారు.
* ప్రధాని ఒక్కరే దేశాన్ని నడపలేరు. దేశమంటే ప్రధాని మాత్రమే కాదు.
* ఉద్యోగులకు మేలు చేయండి, దొంగలకు కాదు(ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై పన్ను విషయంలో). అదొక ఫెయిల్ అండ్ లవ్లీ స్కీం(నల్లధనాన్ని స్వచ్ఛందగా వెల్లడించే పథకంపై)
- బుధవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ
⇒ 60 ఏళ్లలో తాము చేయని పనులను ఎన్డీయే ఇప్పుడు పూర్తిచేస్తోంది కాబట్టి కాంగ్రెస్ అసూయతో రగులుతోంది. ఆత్మన్యూనతతో బాధపడుతోంది. విపక్షానికి అనుభవం ఉంది. ఆ జ్ఞానంతో దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం.
⇒ యువనేతలను ప్రోత్సహిస్తే రాహుల్‌ను మించిపోతారని కాంగ్రెస్‌కు భయం. కొందరికి వయసు పెరుగుతుంది కానీ అర్థం చేసుకునే శక్తి పెరగదు(రాహుల్ ఉద్దేశించి పరోక్షంగా).
⇒ నన్ను 14 ఏళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. నాకు అలవాటైపోయింది.
- గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ
♦ మేం భారత్ నుంచి స్వేచ్ఛ కోరుకోవడం లేదు. భారత్‌లో స్వేచ్ఛ కోరుతున్నాం. ఆకలి, అవినీతి నుంచి విముక్తి కోసం నేను నినదించాను.
♦ రాజద్రోహానికి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి మధ్య చాలా తేడా ఉంది.
♦ దేశంలో 69 శాతం మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. 31 శాతం మందిని మాత్రమే వారు మాటల గారడీతో మోసగించారు.
♦ అఫ్జల్ గురు నాకు ఆదర్శం కాదు. హెచ్‌సీయూ పాలకవర్గం వివక్ష వల్ల ఆత్మహత్య చే సుకున్న రోహిత్ వేముల నాకు అదర్శం.
- గురు, శుక్రవారాల్లో కన్హయ్య కుమార్