సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల నేపథ్యంలో చర్చలు జరిపేందుకు ఢిల్లీ బయలుదేరిన సీనియర్ కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, జీ పరమేశ్వరలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సూచనలతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరిని ప్రతిపాదించాలనే కసరత్తు సాగించేందుకు ఈ నేతలంతా తొలుత రాహుల్ గాంధీతో భేటీ కావాలని నిర్ణయించారు. అయితే జేడీఎస్ నాయకత్వానికి తమ మద్దతును నిర్థారించిన అనంతరమే వీటిపై చర్చించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందని కర్ణాటక కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్పష్ఠం చేశారు.
మరోవైపు జేడీఎస్ నేత, కర్ణాటక పాలనాపగ్గాలు చేపట్టనున్న హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో మరికాసేపట్లో భేటీ కానున్నారు. ఇక మంత్రివర్గ కూర్పుపైనా ఈ సందర్భంగా కాంగ్రెస్ దిగ్గజాలతో కుమారస్వామి చర్చిస్తారని భావిస్తున్నారు. ఏఏ శాఖలు ఎవరికి అప్పగించాలనే దానిపైనా ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ అంశాలూ చర్చకు రానున్నాయి. సీఎం కుమారస్వామి ఆర్థిక, ఆరోగ్య, పీడబ్ల్యూడీ శాఖలను తన వద్దే ఉంచుకోవాలని భావిస్తుండగా, హోం, ఇంధన శాఖ వంటి కీలక శాఖలను కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఈ షరతుతోనే తాను ఎన్నికల అనంతర పొత్తుకు అంగీకరించానని కుమారస్వామి చెబుతున్నారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment