మళ్లీ ‘రఫేల్‌’ ప్రకంపనలు   | Rahul Gandhi attacks Narendra Modi over Rafale deal | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘రఫేల్‌’ ప్రకంపనలు  

Published Sat, Feb 9 2019 1:41 AM | Last Updated on Sat, Feb 9 2019 8:33 AM

Rahul Gandhi attacks Narendra Modi over Rafale deal - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ వివాదాస్పద రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మరో రచ్చ మొదలైంది. ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం(పీఎంవో) సమాంతర చర్చలు జరిపిందని వెలువడిన మీడియా కథనం సంచలనం రేపింది. ఇదే అదనుగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై ఆరోపణల్ని తీవ్రతరం చేశారు. కాపలాదారే దొంగని స్పష్టమవుతోందని, మోదీ దోషి అని నిరూపించడం చాలా తేలికని పేర్కొన్నారు.

రూ.59 వేల కోట్ల విలువైన రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఓ వైపు రక్షణ మంత్రిత్వ శాఖ బృందం ఫ్రాన్స్‌ అధికారులతో చర్చలు జరుపుతోంటే, ప్రధాని కార్యాలయంలోని కొందరు అధికారులు సమాంతర చర్చలకు దిగారని ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ శుక్రవారం వెలుగులోకి తెచ్చింది.  పీఎంవో అధికారుల జోక్యాన్ని తప్పుపడుతూ రక్షణ  శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు 2015 నాటి నోట్‌ను ఉటంకించింది. దీంతో రఫేల్‌ ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. కాగా, ‘ది హిందూ’ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌...విదేశీ కంపెనీల ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ ముగిసిన అధ్యాయాన్నే లేవనెత్తుతోందన్నారు. ఈ ఒప్పందంపై జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. 

రాహుల్‌కు కొత్త ఆయుధం.. 
రఫేల్‌ ఒప్పందంపై ‘ది హిందూ’ వెలుగులోకి తెచ్చిన విషయాల్ని ఆయుధంగా మలచుకుని  మోదీపై రాహుల్‌ విమర్శల పదును పెంచారు. ‘ఎలాంటి విచారణనైనా జరిపించండి. చట్టాన్ని అమలు చేయండి. రాబర్ట్‌ వాద్రా, పి.చిదంబరం..ఇలా అందరిపైనా చట్టాన్ని అమలు చేయండి. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అలాగే, రఫేల్‌ వ్యవహారంపైనా మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి’ అని మీడియా సమావేశంలో రాహుల్‌ డిమాండ్‌ చేశారు. వైమానిక దళం నుంచి రూ.30 వేల కోట్లు దొంగిలించిన ప్రధాని, నిబంధనల్ని పక్కదారి పట్టించి, ఆ సొమ్మును తన స్నేహితుడు అనిల్‌ అంబానీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు.

‘రఫేల్‌ కుంభకోణంలో ప్రధాని నేరుగా జోక్యం చేసుకున్నారని ఏడాదికి ముందు నుంచే  చెబుతున్నాం. ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో ప్రధానే స్వయంగా చర్చలు జరిపారని ఈరోజు వెలుగులోకి వచ్చింది. కాపలాదారే దొంగని నిరూపించడానికి ఇంతకన్నా ఏం కావాలి?’ అని అన్నారు. ‘పీఎంవో జోక్యంతో రక్షణ శాఖ బృందం జరిపే చర్చలు బలహీనపడ్డాయి. పీఎంవో అధికారులు ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో చర్చల నుంచి దూరంగా ఉంటే బాగుంటుంది’ అని రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆ కథనంలోని విషయాల్ని రాహుల్‌ చదివి వినిపించారు. 

వాకబు చేయడం జోక్యం కాదు: నిర్మలా
కాంగ్రెస్‌ ఆరోపణల్ని ఖండిస్తూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బదులిచ్చారు. ‘ముగిసిన కథనే మళ్లీ  లేవనెత్తుతున్నారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో పురోగతిపై పీఎంవో వివరాలు తెలుసుకోవాలనుకోవడం జోక్యం చేసుకోవడం కాదు’ అని ఆమె అన్నారు. కొనుగోలు ధరలపై పీఎంవో అధికారులు ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో చర్చలు జరపడంపై నాటి రక్షణ శాఖ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేశారనే కథనంపై స్పందిస్తూ..అప్పటి రక్షణ మంత్రి పరీకర్‌ సవ్యంగానే ఉందని సదరు అధికారికి సూచించారని తెలిపారు. యూపీయే హయాంలో జాతీయ సలహా మండలి(ఎన్‌ఏసీ) చైర్మన్‌ హోదాలో సోనియా గాంధీ పీఎంవో కార్యాలయానికి ఆదేశాలు జారీచేశారని, అది జోక్యం చేసుకోవడం కాదా? అని ప్రశ్నించారు. 

రాహుల్‌ కర్మాగారం నుంచి మరో అసత్యం: బీజేపీ 
ఒప్పందాన్ని రద్దుచేయాలని విదేశీ శక్తుల నుంచి ఆదేశాల మేరకు రాహుల్‌ కొత్త అసత్యాలు అల్లుతున్నారని బీజేపీ వ్యాఖ్యానించింది. తన అసత్యాల కర్మాగారం నుంచి రాహుల్‌ మరో అబద్ధాన్ని వెలికితీశారని ఎద్దేవా చేసింది. ఇటీవల యూరప్‌లో పర్యటించిన రాహుల్‌ ఏ విమాన సంస్థ అధికారులతో సమావేశమయ్యారో వెల్లడించాలని కేంద్ర మంత్రి జవడేకర్‌ అన్నారు. రఫేల్‌ ఒప్పందాన్ని రద్దుచేయడానికి రాహుల్, కాంగ్రెస్‌ పనిచేస్తున్నాయని, స్వప్రయోజనాలతో కూడిన విదేశీశక్తులకు వారు లొంగిపోయారని ఆరోపించారు. 2011లోనే రఫేల్‌ ఒప్పందాన్ని ఖాయం చేసుకున్న యూపీయే ప్రభుత్వం కమిషన్ల రాకపోవడంతో ముందుకు సాగనివ్వలేదని పరిహసించారు. రఫేల్‌ ఒప్పందంలో ఎలాంటి కుంభకోణం లేదని సుప్రీంకోర్టే స్పష్టం చేసిందని, అయినా ఈ సంగతిని రాహుల్‌ అంగీకరించడంలేదని అన్నారు. అబద్ధాన్ని మళ్లీమళ్లీ చెబితే, నిజమైపోదని హితవు పలికారు. 

పార్లమెంట్‌లో ‘రఫేల్‌’ ప్రకంపనలు.. 
రఫేల్‌ ఒప్పందం చర్చలలో ప్రధాని కార్యాలయ అధికారులు జోక్యం చేసుకున్నారని వచ్చిన కథనం లోక్‌సభ, రాజ్యసభలో ప్రకంపనలు సృష్టించింది. మధ్యాహ్నం లోక్‌సభ ప్రారంభం కాగానే, ఇదే అంశంతో విపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. కాంగ్రెస్, తృణమూల్, ఇతర విపక్షాలు ప్రధాని మోదీ రాజీనామా చేయాలని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. రఫేల్‌ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్‌ కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశాయి. సభ్యులంతా తమ సీట్లలో కూర్చుంటే ఒకరి తరువాత ఒకరిని మాట్లాడనిస్తానని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ హామీ ఇచ్చారు. తృణమూల్‌ ఎంపీ సౌగతా రాయ్‌ మాట్లాడుతూ..రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు చర్చలు జరుపుతోంటే, పీఎంవో బృందం ఎందుకు జోక్యం చేసుకుందని ప్రశ్నించారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పారిస్‌లో చర్చలు జరిపారని, దీంతో మెరుగైన బేరసారాలు చేసేందుకు ప్రభుత్వ శక్తి తగ్గిపోయిందని అన్నారు. ప్రభుత్వ తీరు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రఫేల్‌ ఒప్పందం కోసం పీఎంవో, రక్షణ శాఖలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని, ఇదే విషయం పత్రికలో కూడా వచ్చిందని అన్నారు. అసలు నిజమేంటో జేపీసీతోనే బయటకు వస్తుందని పేర్కొన్నారు. రఫేల్‌ ఒప్పందంపై జరిగిన చర్చలో ప్రభుత్వం ఇది వరకే అన్నింటికి సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. మరోవైపు, రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొనడంతో సభ రోజంతటికీ వాయిదా పడింది. 

పీఎంవోకు సంబంధం లేదు: మాజీ అధికారులు 
రఫేల్‌ ఒప్పందంపై పీఎంవో సమాంతర చర్చలు జరిపిందన్న ఆరోపణల్ని ఆనాడు భారత రక్షణ బృందానికి నేతృత్వం వహించిన ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌బీపీ సిన్హా తోసిపుచ్చారు. రక్షణ శాఖ మాజీ కార్యదర్శి మోహన్‌ కుమార్‌ హిందూ కథనాన్ని ఖండించారు. ఒప్పందం కోసం చర్చలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. నోట్‌లో చెప్పింది ప్రభుత్వ హామీ గురించే కానీ, ధరల గురించి కాదని అన్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ నోట్‌ రాశారో తెలియదని పేర్కొన్నారు. రఫేల్‌ డీల్‌ కోసం ఎలాంటి సమాంతర చర్చలు జరగలేదని, ఒప్పందంలోని ప్రతి పదాన్ని ఇరు దేశాల తరఫున చర్చల్లో పాల్గొన్న బృందాలే ఖరారుచేశాయని,  ఇతర సంస్థలు, వ్యక్తులకు ఇందులో పాత్ర లేదని సిన్హా తెలిపారు. ఇలాంటి నోట్‌ను భారత మీడియాలో తొలిసారి చూశానని, చర్చల్లో పాల్గొన్న బృందంలోని సభ్యులెవరికీ దీని గురించి తెలియదని చెప్పారు.

 ఫైల్‌ నోట్‌లోఏముంది?
ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో రక్షణ శాఖ బృందం చర్చలు జరుపుతుంటే, మరోవైపు, పీఎంవో అధికారులు సమాంతర చర్చలు జరిపారు. దీంతో మెరుగైన ఒప్పందం కుదర్చుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు బలహీనమయ్యాయని 2015, నవంబర్‌ 24న రక్షణ శాఖ మంత్రి  మనోహర్‌ పరీకర్‌ దృష్టికి తీసుకొచ్చింది. ‘ఫ్రెంచ్‌ అధికారులతో చర్చల నుంచి పీఎంవో బృందం దూరంగా ఉంటే మంచిదని భావిస్తున్నాం. మేము జరిపే చర్చల నుంచి వచ్చే ఫలితాలపై విశ్వాసం లేకుంటే, సమయం వచ్చినప్పుడు పీఎంవో నేతృత్వంలోనే చర్చల కోసం కొత్త విధివిధానాల్ని రూపొందించి అమలుచేయొచ్చు’ అని ఫైల్‌నోట్‌లో పేర్కొంది. అప్పటి వైమానిక దళ డిప్యూటీ చీఫ్‌ నేతృత్వంలో ఏడుగురితో కూడిన బృందం భారత్‌ తరఫున ఫ్రాన్స్‌తో చర్చలు జరిపింది. ఫ్రెంచ్‌ బృందానికి నేతృత్వం వహించిన జనరల్‌ స్టీఫెన్‌ రెబ్‌ 2015, అక్టోబర్‌ 23న రక్షణ శాఖకు పంపిన లేఖ ద్వారా పీఎంవో సమాంతర చర్చలు వెలుగుచూశాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement