
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. తాజాగా తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పదిరోజుల్లోగా రైతు రుణ మాఫీపై విధానం ప్రకటిస్తామన్నారు.గుజరాత్ సీఎం విజయ్ రూపానీని రబ్బర్ స్టాంప్‌గా అభివర్ణించిన రాహుల్ బీజేపీ చీఫ్ అమిత్ షా రాష్ట్రంలో రిమోట్ కంట్రోల్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తల రుణాలు రూ 1.25 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ రైతు రుణ మాఫీ కోసం తాము కోరితే అది తమ విధానం కాదన్నారని చెప్పారు.
పటేల్ ప్రాబల్య అమ్రేలి జిల్లాలో జరిగిన ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. మోదీ 22 ఏళ్లుగా రైతుల గురించి మాట్లాడుతున్నా వారికి ఏమీ చేయలేదని, రైతుల భూములు గుంజుకుని, సాగు నీటిని పారిశ్రామికవేత్తలకు తరలించారని ఆరోపించారు. రైతులకు కనీసం పంట బీమా కూడా అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
గుజరాత్‌లో పటేళ్లు, దళితులు,రైతులు, అంగన్‌వాడీలు సహా అన్ని వర్గాలవారు తొలిసారిగా నిరసన బాటపట్టారని అన్నారు. కేవలం విమానాల్లో తిరిగే మోదీ స్నేహితులు ఐదు,పది మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వారిలో కొందరు నానో కారు రూపొందించేందుకు రూ 33,000 కోట్లు పొందారని పరోక్షంగా రతన్ టాటాను ఉద్దేశించి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment