
కిందపడిన ఫోటోగ్రాఫర్‌కు చేయిచ్చిన రాహుల్..
భువనేశ్వర్ : తన కళ్లెదుట కింద పడిపోయిన ఫోటోగ్రాఫర్‌ను పైకి లేపేందుకు ఒక్క ఉదుటున కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కదిలిన వీడియో వైరల్ అవుతోంది. భువనేశ్వర్ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రాహుల్ స్పందించిన తీరును పలువురు ప్రశంశిస్తున్నారు. రాహుల్ ఫోటోగ్రాఫర్‌కు చేయూత ఇచ్చేందుకు కదిలిన తీరుపై కాంగ్రెస్ సభ్యులు హసీబా ప్రధాని నరేంద్ర మోదీని ఎండగట్టేందుకు ఉపయోగించుకున్నారు.
కిందపడిన ఫోటోగ్రాఫర్‌కు సాయం అందించేందుకు కాంగ్రెస్ చీఫ్ ఎలా పరుగులుపెట్టారో చూడండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. గతంలో మోదీ ప్రసంగిస్తుండగా ఆయన ఎదుటే ఓ పోలీస్ అధికారి కుప్పకూలినా ఆయన తన ప్రసంగం కొనసాగించిన ఘటనతో పోల్చుతూ ఇంత జరిగినా ఏమీ జరగనట్టే ప్రధాని అప్పట్లో తన ప్రసంగాన్ని కొనసాగించారని దుయ్యబట్టారు.
ఒకరు ప్రాణాలు విడుస్తున్నా మోదీజీ పట్టించుకోకుండా తన ఉపన్యాసం కొనసాగిస్తారని ఆమె చురకలు వేశారు. మీ పక్కనున్న వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుకు గురైతే మీరు ఆ వ్యక్తికి సాయపడేందుకు ఉద్యుక్తులవుతారు అయితే మన ప్రధాని అలా కాదంటూ అప్పటి వీడియోను పోస్ట్ చేశారు. కాగా 2013లో మోదీ గుజరాత్ సీఎంగా వ్యవహరిస్తున్న సమయంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా అప్పటి రాష్ట్ర డీజీపీ అమితాబ్ పాథక్ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆ తర్వాత తాను కుదుటపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.