
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
రాహుల్ యాత్రపై కాంగ్రెస్, బీజేపీల దుమారం
న్యూఢిల్లీ : శివుడే విశ్వమని అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన కైలాష్ మానససరోవర్ యాత్రకు సంబంధించిన వీడియోను శుక్రవారం ట్వీట్ చేశారు. రాహుల్ యాత్ర బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హాట్ టాపిక్‌గా మారిన క్రమంలో కాంగ్రెస్ చీఫ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్ట్ 31న కైలాష్ మానససరోవర్ యాత్రకు బయలుదేరిన రాహుల్ అక్కడి ఫోటోలు, యాత్ర వివరాలను వెల్లడిస్తూ ఇటీవల ట్వీట్ చేశారు. మానససరోవర్ సరస్సు జలాలు అత్యంత స్వచ్ఛంగా ఉన్నాయని, ఇవి ద్వేషాలకు దూరమని వ్యాఖ్యానించారు. ఎవరికైనా పిలుపు వచ్చినప్పుడే ఈ యాత్రకు వస్తారని, తనకు ఈ అవకాశం రావడం అదృష్టమని చెప్పుకొచ్చారు.
మరోవైపు మానససరోవర్ యాత్రకు బయలుదేరేముందు నేపాల్‌లోని ఓ హోటల్‌లో రాహుల్ మాంసాహారం తీసుకున్నారనే వార్తలపై పెనుదుమారం చెలరేగింది. రాహుల్ చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించగా, ఆయన పూర్తి శాఖాహార వంటకాలే ఆర్డర్ ఇచ్చారని ఆ తర్వాత రెస్టారెంట్ యాజమాన్యం ఓ ప్రకటన చేసింది. ఇక రాహుల్ యాత్రను సమర్ధిస్తూ బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన ట్వీట్లను కాంగ్రెస్ స్వాగతించింది. రాహుల్ కైలాష్ యాత్రను సమర్ధిస్తూ నిజాయితీగా ఆయన ట్వీట్ చేశారని, అయితే పార్టీ హైకమాండ్‌కు భయపడి ట్వీట్లను తొలగించారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు.