మోడీ ఓ హిట్లర్: రాహుల్
గుజరాత్ పర్యటనలో నిప్పులు
రైతుల భూములు లాక్కొని కార్పొరేట్లకు పంచారని ధ్వజం
దేశ ఖజానాకు ఆయన ‘చౌకీదారు’గా అక్కర్లేదని విమర్శ
బాలాసినోర్ (గుజరాత్): గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. మోడీని ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ దుయ్యబట్టారు. కార్పొరేట్ల కోసం ఆయన ప్రభుత్వం రైతుల భూములను లాక్కుందని ఆరోపించారు. దేశవ్యాప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో రాహుల్ పర్యటించారు. ఖేడా జిల్లాలోని బాలాసినోర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీతోపాటు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను తూర్పారబట్టారు. బీజేపీకి సొంత సిద్ధాంతమంటూ ఏదీ లేదని...అందుకే దివంగత కాంగ్రెస్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని లాక్కునేందుకు ఆయన జ్ఞాపకార్థం పేరుతో భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. తమ పార్టీ ఎన్నటికీ ఆర్‌ఎస్‌ఎస్ లేదా బీజేపీ నేతలను అనుసరించబోదని హామీ ఇచ్చారు.
నాయకుల్లో రెండు రకాల వారు ఉంటారని...వారిలో ఒకరు గాంధీజీలా ప్రజల వద్దకు వెళ్లి వారిని అర్థం చేసుకుంటారని చెప్పారు. వారిలో గర్వం ఉండదన్నారు. ఇక రెండో రకం నాయకులు హిట్లర్‌లా ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తుంటారని...యావత్ ప్రపంచ విజ్ఞానమంతా తన మెదడులోనే ఉందని విర్రవీగుతుంటారని పరోక్షంగా మోడీని ఉద్దేశించి విమర్శించారు.
ఇదేం ‘చౌకీదారీ’?: ప్రధాని పదవి చేపడితే అవినీతి నుంచి దేశ ఖజానాను కాపాడేందుకు తాను చౌకీదారుగా (కాపలాదారు) ఉంటానంటూ మోడీ చేసిన ప్రకటనను రాహుల్ ఎద్దేవా చేశారు. ‘‘గుజరాత్‌లో ఎలాంటి ‘చౌకీదారీ’ నడుస్తోంది? రైతుల నుంచి లక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. ‘చౌకీదారీ’ అంటే రైతుల భూములను దొంగిలించడమేనా? అలాంటి వారి ‘చౌకీదారీ’ మనకు అక్కర్లేదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
మోడీ ముందు పటేల్ గురించి తెలుసుకోవాలి
గుజరాత్‌లో బీజేపీ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించడం మంచిదే అయినా మోడీ తొలుత పటేల్ గురించి తెలుసుకోవాలని రాహుల్ సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం విషపూరితమని, అది దేశాన్ని నాశనం చేస్తుందని పటేల్ చెప్పేవారని రాహుల్ గుర్తుచేశారు. కానీ బీజేపీ నేతలు వారి జీవితమంతా ఆర్‌ఎస్‌ఎస్‌లోనే గడిపారన్నారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని మాట్లాడుతున్న బీజేపీ నేతలు...గాంధీజీ, పటేల్ నిర్మించిన పార్టీని (కాంగ్రెస్) నాశనం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.