సాక్షి, ముంబై: రాత్రి వేళల్లో మహిళ బోగీల్లో రైల్వే పోలీసులు మద్యం మత్తులోనే విధులకు హాజరవుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.రెండు రోజుల కిందట రాత్రి ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి కసారా బయలుదేరిన లోకల్ రైలు మహిళ బోగీలో హెడ్ కానిస్టేబుల్ రమేశ్ దేవరా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. కసారా-ఖర్డీ స్టేషన్ల మధ్య రమేష్ భుజానికి తగిలించి ఉన్న తుపాకి జారి కిందపడిపోయింది.
ఆ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన రమేష్ తర్వాత కల్యాణ్ రైల్వే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తుపాకి జారిపోయిన విషయం తెలియని స్థితిలో ఉన్నాడంటే అతడు మద్యం తాగి ఉండవచ్చని పైఅధికారికి అనుమానం వచ్చింది. అతడి రక్తపు నమూనాలు పరీక్ష చేయించగా అతడు మద్యం తాగి ఉన్నట్లు నివేదిక వచ్చింది. దీంతో రమేష్‌పై పోలీసు ఇన్‌స్పెక్టర్ మోహితే కేసు నమోదు చేశారు. రాత్రి వేళల్లో మహిళ బోగీల్లో చోరీలు, దాడులు జరుగుతున్నట్లు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి.
దీంతో రైల్వే పరిపాలన విభాగం ప్రతీ లోకల్ రైలు మహిళ బోగీలో ఓ సాయుధ పోలీసును నియమించడం ప్రారంభించింది. కాకా, వారు మద్యం మత్తులో తూలుతున్న విషయం బయటపడటంతో మహిళా ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దొంగల మాట దేవుడెరుగు.. మద్యం మత్తులో ఆ పోలీసే తమపై అఘాయిత్యానికి పాల్పడితే పరిస్థితి ఏంటని వారు రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు.
మద్యం మత్తులో రైల్వే పోలీసులు
Published Mon, Nov 17 2014 10:46 PM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM
Advertisement
Advertisement