న్యూఢిల్లీ: కొత్త రైల్వే లైన్లు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ సంపూర్ణంగా జరిగిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. లేదంటే అవసరమైన భూమిని తప్పకుండా అప్పగిస్తామని కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు లిఖిత పూర్వక హామీనైనా ఇస్తేగానీ పనులు మొదలుపెట్టకూడదని రైల్వే నిశ్చయించింది. ప్రస్తుతం కొత్తలైనుకు అవసరమైన 70 శాతం భూమి లభ్యమవ్వగానే రైల్వే శాఖ లైను నిర్మాణం ప్రారంభిస్తోంది. దీనివల్ల కొన్నిసార్లు భూమి దొరకక పనుల్లో తీవ్ర జాప్యమై వ్యయం పెరిగిపోవడం లేదా పనులు పూర్తిగా నిలిచిపోవడం జరుగుతున్నందున తాజా నిర్ణయం తీసుకుంది.
ఇకపై భూసేకరణ సంపూర్ణంగా జరిగేవరకు టెండర్లను పిలవకూడదని రైల్వే నిర్దేశించుకుంది. అయితే మొత్తం కొత్త రైల్వే లైనును కొన్ని భాగాలుగా విభజించి...ఏదేనీ నిర్దేశిత భాగంలో భూమి లభ్యంగా ఉన్నప్పడు పనిని ప్రారంభించవచ్చనీ, అందునా మొత్తం రైల్వే లైనుతో సంబంధం లేకుండా ప్రత్యేకించిన ఆ భాగం మాత్రమే పూర్తయినా రైల్వేకు లాభాలు వస్తాయనుకున్న సందర్భంలోనే ఇలా చేయాలని రైల్వే శాఖ జోనల్ జనరల్ మేనేజర్లను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నగరి, తమిళనాడులోని తిండివనం రైల్వే స్టేషన్ల మధ్య లైను (179.2 కిలో మీటర్లు) నిర్మాణంలో జరిగిన జాప్యాన్ని రైల్వే శాఖ ఈ సందర్భంగా ఉదహరించింది.
ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్
ఆలస్యంగా విధులకు హాజరయ్యే ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా ఝళిపించనుంది. జనవరి 31 కల్లా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. జోనల్, డివిజనల్ కార్యాలయాలు, రైల్వే వర్క్‌షాప్‌లు, ఫ్యాక్టరీలు, ఉత్పత్తి యూనిట్లలో ఈ నెల చివరి నాటికే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment