తడిచి మురిసిన బెంగళూరు
బెంగళూరు: కూల్ సిటీ బెంగళూరు తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకుంది. 148 సంవత్సరాల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుతో అతలాకుతలమైన నగరం సోమవారం సాయంత్రం కురిసిన వర్షాలతో తడిచి ముద్దయింది. ఉరుములు, మెరుపులతో నగరంలో అనేక ప్రాంతాల్లో కురిసిన వర్షం నగరవాసులను ఆనందడోలికల్లో ఓలలాడించింది. మండించే ఎండలనుంచి ఉపశమనంగా వర్షాలు పలకరించి సేదతీర్చడంతో జనం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, రాత్రి 9 గంటలకు వరకు 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సోమవారం నమోదైన 37.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతతో బెంబేలెత్తిన జనం ఎండవేడిమి నుంచి సేదతీరారు. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కారణంగా వాతావరణంలో తేమ శాతం 86 శాతం పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు.
కెంపారా, పాత విమానాశ్రయం రోడ్ లో భారీ వర్షం కురిసింది. వాల్మీకి నగర్ లో 10 చెట్లు నేలకూలాయి. మైసూర్ రోడ్, చామరాజ్ పేట్, ఓకలిపురం, సంపంగి రామ్ నగర్, విక్టోరియా రోడ్ తదితర ప్రాంతాలతోపాటూ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో భారీ వర్షం నమోదైంది. ఈ వర్షం కారణంగా అక్కడక్కడా ట్రాఫిక్ జామ్, విద్యుత్ స్థంభాలు విరిగి పడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. అయినా గతంలో లాగా వర్షం తమని తప్పకుండా ఆదుకుంటుందని ఆశించామంటూ నగర వాసులు సంబరాలు చేసుకున్నారు.