
మీడియాతో రజనీకాంత్
సాక్షి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల మృతుల కుటుంబాలను సూపర్‌స్టార్ రజనీకాంత్ బుధవారం పరామర్శించారు. కాల్పుల్లో చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడ్డవారికి పది వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం రజనీ మీడియాతో మాట్లాడుతూ.. తూత్తుకుడి ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం వంటిదన్నారు. ప్రభుత్వం జాగ‍్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమాయక ప్రజల పట్ల స్టెరిలైట్ పరిశ్రమ యాజమాన్యం అమానుషంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడం చాలా పెద్ద తప్పన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాల్పులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం 100వ రోజు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. దాదాపు 65 మంది గాయపడ్డారు.