రజనీ.. రాజకీయాలకు సరిపోడు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు ఏమాత్రం సరిపోడని, ఆయన నటనారంగానికి మాత్రమే పరిమితం అయితే సరిపోతుందని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మండిపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితికి రజనీ ఏమాత్రం సరిపోడని, ఆయనకు అసలు రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు లేదా మరే విషయం గురించి అసలు ఐడియా లేదని అన్నారు. రజనీ డైలాగులు బాగా చెప్పి జనాన్ని ఆనందింపజేస్తారని, అందువల్ల ఆయన సినిమాలకు పరిమితం అయితే బాగుంటుందని స్వామి చెప్పారు. అసలు సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం ఎందుకని, ఇప్పటికే తమిళ రాజకీయాల్లోకి వచ్చిన సినిమావాళ్లు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు.
కామరాజ్ నాడార్ హయాంలో జరిగిన అభివృద్ధి మొత్తాన్ని సినిమావాళ్లు వచ్చి పాడుచేశారని, అందుకే తాను సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్వామి తెలిపారు. తలైవా బీజేపీలో చేరబోతున్నారని, అందుకే పలువురు పార్టీ పెద్దలు కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని వచ్చిన కథనాలను ప్రస్తావించగా, ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఆయన ఏ పార్టీలోనూ చేరుతున్నట్లు చెప్పలేమన్నారు.