సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి కావాలని తాను ఎన్నడూ అనుకోలేదని, స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని తమిళ ప్రజలు గట్టిగా కోరుకున్న రోజున రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అవినీతి రహిత, స్వచ్ఛమైన రాజకీయాలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం మూడంచెల ఫార్ములాను అనుసరిస్తున్నట్లు రజనీ చెప్పారు. పార్టీ వ్యవహారాలకు, పాలనకు మధ్య సంబంధం అస్సలు ఉండదని, సమర్థమైన సంస్థాగత వ్యవస్థ ఉంటుందని, యువతకు పెద్దపీట వేస్తామని ఆయన గురువారం చెన్నైలో విలేకరులకు చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలు గట్టిగా కోరుకున్న రోజున తాను రాజకీయాల్లోకి వచ్చితీరతానని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు.
ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చోవాలని కలలో కూడా ఊహించలేదని, తనను భావి ముఖ్యమంత్రిగా చిత్రీకరించడాన్ని ఇప్పటికైనా మీడియా మానుకోవాలని కోరారు. మూడేళ్ల క్రితం అంటే 2017 డిసెంబర్ 31న రజనీకాంత్ ఒక ప్రకటన చేస్తూ.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ‘రాజకీయ, ప్రభుత్వ మార్పు ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు’అని కూడా ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిల మరణం తరువాత తమిళనాడులో రాజకీయ శూన్యం ఏర్పడిన నేపథ్యంలో రజనీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment