
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా సాగిన సుదీర్ఘ లాక్‌డౌన్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతుంటే ప్రభుత్వం వైరస్‌ను నియంత్రించకపోగా జీడీపీని నియంత్రించిందని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బజాజ్ లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్పారు. లాక్‌డౌన్ ను కఠినంగా అమలుచేసినా వైరస్ విజృంభణను అడ్డుకోలేకపోగా, ఆర్థిక వ్యవస్ధ చిక్కుల్లో కూరుకుపోయిందని అన్నారు. ప్రభుత్వం ఇన్ఫెక్షన్ చైన్‌ను తెంచలేదని, ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అడ్డుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా వైరస్‌పై పోరులో సమతూకంతో వ్యవహరించిన జపాన్ తరహా దేశాలను మనం అనుసరించకుండా అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి పాశ్చాత్య దేశాలను అనుసరించడంతో భంగపడ్డామని రాజీవ్ బజాజ్ విమర్శించారు. లాక్‌డౌన్‌ను చేదు-తీపి అనుభవంగా అభివర్ణించిన బజాజ్ సుదీర్ఘ లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులను భరించగలిగిన వారికి మాత్రమే ఇది అనుకూలంగా ఉందని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తీపి కన్నా చేదు ఫలితాలే అధికమని చెప్పుకొచ్చారు. వైరస్ పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొనేలా ప్రచారం సాగిందని, ఇప్పుడు వారి ఆలోచనా ధోరణి మార్చడం కష్టమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment