
ముంబై: కరోనా అంటువ్యాధిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం15 రోజుల లాక్‌డౌన్‌ను పరిశీలిస్తున్నట్లు వచ్చిన వార్తలపై బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ స్పందించారు. ఏడాది క్రితం మెడికల్ మౌలిక వసతుల లేమి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలైన సంగతిని రాజీవ్ బజాజ్ గుర్తు చేశారు. గతేడాది ప్రపంచంలోకెల్లా కఠిన ఆంక్షల మధ్య భారత్ లాక్‌డౌన్ అమలు చేసిందని చెప్పారు. అప్పటి నుంచి మౌలిక వసతులను సమకూర్చుకోలేని దేశం కేవలం 14 రోజుల్లో ఎలా సాధిస్తారో ప్రభుత్వం మాకు చెప్పాల్సిన అవసరం ఉంది అని బజాజ్ అన్నారు.
తాజా డేటా ప్రకారం, ఒక్కరోజులోనే మహారాష్ట్ర 60,000 కొత్త కేసులను గుర్తిస్తే భారతదేశం అంతటా ఈ సంఖ్య 1.6 లక్షలకు పైగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరోమారు మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలొస్తున్నాయి. అవసరమైన వారికీ పరీక్షలు నిర్వహించకుండా కంపెనీల్లో పనిచేసే వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనడం సరైన చర్య కాదని అయన పేర్కొన్నారు. ఇది 'క్లాసిక్ కేస్ ఆఫ్ ఓవర్ రెగ్యులేషన్' అని అన్నారు.
భారతదేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా దాదాపు 15శాతం ఉంటుంది అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఒకవేల లాక్‌డౌన్ విధిస్తే ఆ ప్రభావం దేశం మీద పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరొక లాక్‌డౌన్ విధించినట్లయితే చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు 'నిజమైన, స్పష్టమైన తక్షణ' మద్దతు ఉండాలని బజాజ్ నొక్కిచెప్పారు. ఎన్నికల సభలు, మతపరమైన మేళాల్లో నిబంధనల ఉల్లంఘన విషయంలో రాజకీయ నేతలు మౌనంగా ఉండటాన్ని, ద్వంద్వ వైఖరిని అవలంభించడాన్ని రాజీవ్ బజాజ్ నిలదీశారు. "కంపెనీల సీఈఓలు ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రభుత్వం ముంగిట గొర్రెల్లా నిలబడి తల ఊపబోమని" రాజీవ్ బజాజ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment