
త్వరలోనే పాక్ కాల్పులకు బ్రేక్!
భారత సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులు ఆపేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
► మరికొంతకాలం ఆగితే సరిపోతుంది: రాజ్‌నాథ్
► కశ్మీర్‌లో శాంతికి ‘5 సీ’ ఫార్ములా
నౌషేరా: భారత సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులు ఆపేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇందుకోసం కొంతకాలం ఆగితే సరిపోతుందని సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ వైపునుంచి కాల్పులు జరిగితే వారు ఊహించని స్థాయిలో ప్రతీకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నాలుగురోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా సోమవారం జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్దనున్న గ్రామాలనుంచి వచ్చిన వారినుద్దేశించి మంత్రి మాట్లాడారు. ‘కొంతకాలం ఆగండి. పాకిస్తాన్ కాల్పులను ఆపేలా ఒత్తిడి పెరుగుతుంది.
నేడో, రేపో వాళ్లు కాల్పులు ఆపేస్తారు. ఆ తర్వాత ఒకవేళ పాకిస్తాన్ ఒక్క బుల్లెట్ కాల్చి నా.. బుల్లెట్లను లెక్కపెట్టకుండా భారత్ ప్రతీకారాన్ని చవిచూడాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. భారత్ వైపునుంచే ముందుగా కాల్పులు జరగకూడదని బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు రాజ్‌నాథ్ సూచించారు. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇటీవల కశ్మీర్ లోయలో శాంతి చిగురిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు అందరితోనూ సమావేశమవుతాం. ఈ సమస్యకు కంపాషన్ (సహానుభూతి), కమ్యూనికేషన్ (సమాచార మార్పిడి), కోఎగ్జిస్టెన్స్ (సహజీవనం), కాన్ఫిడెన్స్ బిల్డింగ్ (విశ్వాసం పెంచటం), కన్సిస్టెన్సీ (స్థిరత్వం) అనే 5 సీ ఫార్ములాతో ముందుకెళ్లనున్నాం’ అని ఆయన తెలిపారు.