
ఇండోర్: సుప్రీంతీర్పు ప్రకారం ఏర్పాటయ్యే రామాలయ నిర్మాణ ట్రస్ట్.. గతంలో రామజన్మభూమి న్యాస్ రూపొందించిన డిజైన్ ప్రకారమే భవ్యమందిరాన్ని నిర్మించాలని ఆశిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోక్జే చెప్పారు. అయోధ్య వివాదంపై తాజా తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ అంశంలో ఎవరూ విజేతలు లేదా పరాజితులు కారని, శతాబ్దాలుగా నలుగుతున్న ఒక అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని వ్యాఖ్యానించారు. తాజా తీర్పు సమతుల్యంగా ఉందని కొనియాడారు.
రామాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు రామజన్మభూమి న్యాస్ చాలా పనులు చేసిందని ఆయన గుర్తు చేశారు. డిజైన్ రూపొందించడం, శిల్పాలు, స్తంభాలు చెక్కించడం సహా పలు పనులు న్యాస్ చేస్తోందని, అందువల్ల న్యాస్ రూపొందించిన డిజైన్‌ను ట్రస్ట్ అమలు చేస్తే ఆలయ నిర్మాణం సులభతరం అవుతుందని చెప్పారు. ఇప్పటికైతే ట్రస్ట్ తమ అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందని అనుకోవడంలేదన్నారు. ట్రస్ట్‌లో రామభక్తులే ఉంటారని, అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయ పడ్డారు.
2024కల్లా రామ మందిరం పూర్తవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తీర్పు విషయంలో ప్రయోజనం పొందేందుకు కొందరు ముందుకువస్తారని, కానీ ఈ విషయంలో ఎవరు కష్టపడ్డారో, ఎవరు పోరా డారో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.